ఆయన ఉత్తరాంధ్రాలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు. ఈ ప్రాంతంలో హోం మంత్రి వంటి అతి కీలకమైన శాఖను నిర్వహించిన ఏకైక నేత. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్న కళా వెంకటరావు ఇపుడు పసుపు గడపను వీడుతారా అన్న దాని మీద వాడి వేడిగానే చర్చలు సాగుతున్నాయి.
కళా వెంకటరావు గతంలో టీడీపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి తిరిగి వచ్చారు. దాంతో ఆయన మీద వస్తున్న ప్రచారాన్ని నమ్మడానికి అస్కారం ఉందని అంటున్నారు.
ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాల్లో బలమైన సామాజికవర్గానికి చెందిన కళా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ మధ్యనే ఆయన పదవిని మరో కీలకనేత అచ్చెన్నాయుడుకు ఇచ్చారు.
అయితే ఈ పరిణామాలతో కళా కలత చెందారని వార్తలు మాత్రం ఉన్నాయి. దాంతో పాటు ఆయన బీజేపీలోకి చేరుతారు అంటూ జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా పసుపు శిబిరం ఉలిక్కిపడింది. కళా వంటి సీనియర్ మోస్ట్ నేత పార్టీని వీడితే ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు అన్నది 2009 ఎన్నికల వేళనే టీడీపీకి తెలిసింది.
దాంతో దీని మీద పార్టీ అధినాయకత్వం హడావుడిగా వాకబు చేసినట్లు భోగట్టా. దీంతో తాను పార్టీ మారడం లేదని, చంద్రబాబుతోనే ఉంటానని కళా వెంకటరావు తాజాగా ప్రకటించారు. ఏది ఏమైనా కళా కలకలం టీడీపీని స్థిమితంగా ఉండనీయడంలేదని అంటున్నారు.