బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీంతో భూమా కుటుంబానికి బాగా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. అయితే అరెస్ట్ కంటే కూడా మరో విషయం భూమా అఖిలప్రియ కుటుం బాన్ని ఘోరంగా డ్యామేజ్ చేసిందని ఆమె అనుచరులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇరుక్కున్న అఖిలప్రియ విషయంలో సొంత పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు మౌనం ఆశ్రయించడం అతిపెద్ద డ్యామేజ్‌గా రాజకీయ విశ్లేషకులు, భూమా అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
భూమా అఖిలప్రియపై కిడ్నాప్ కేసు నమోదు, అరెస్ట్‌కు సంబంధించి చంద్రబాబు, లోకేశ్ మాటమాత్రం కూడా నోరెత్తకపోవడంతో …ఆ కేసులో అఖిలప్రియకు నేరుగా ప్రత్యక్ష సంబంధం ఉందనే సంకేతాలు వెళ్లినట్టైందంటున్నారు.
బాబు, లోకేశ్ మౌనమే అఖిలప్రియ నేరాన్ని నైతికంగా ఒకట్రెండు రోజుల్లోనే నిర్ధారించిందని, దీంతో ఆమెతో పాటు భూమా కుటుంబానికి బాగా నష్టం జరిగిందని చెబుతున్నారు.
అఖిలప్రియ తప్పు లేకుంటే , చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మద్దతుగా నిలవరని? అలాగే ఎందుకు పరామర్శించలేదనే ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి వాళ్ల మౌనమే కారణమైందని చెబుతున్నారు. మాజీ మంత్రులందరి విషయంలో ఇదే రీతిలో బాబు మౌనంగా ఉండి ఉంటే …ఇప్పుడు అఖిలప్రియ విషయంలో బాబు, లోకేశ్ స్పందన గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదని అంటున్నారు.
కానీ ఇదే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ అయిన సందర్భాల్లో చంద్రబాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ నాయకుల స్పందనను భూమా అనుచరులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, బీసీలను టార్గెట్ చేస్తోందని చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రులు , ఇతర టీడీపీ నాయకులు విమర్శించిన సంగతి తెలిసిందే. అలాగే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను చంద్రబాబు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుటుంబాన్ని లోకేశ్ నేరుగా పరామర్శించి , వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మరి అఖిలప్రియ విషయంలో ఆ చొరవ ఏమైంది?
చంద్రబాబు, లోకేశ్ నోరెత్తకపోవడం వల్ల భూమా అఖిలకు, ఆమె కుటుంబానికి జరిగిన నష్టం అంతాఇంతా కాదంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేయడం కంటే, చంద్రబాబు, లోకేశ్ ఏమీ మాట్లాడకపోవడం వల్ల భూమా అఖిలప్రియ నేరాన్ని సొంత పార్టీ వాళ్లే నిర్ధారించినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల చంద్రబాబును అఖిలప్రియ చెల్లి మౌనిక నేరుగా కలిసినప్పుడు కూడా, ఆయన నుంచి నామమాత్రంగా కూడా భరోసా లభించలేదని భూమా అనుచరులు వాపోతున్నారు.
అఖిలప్రియ అరెస్ట్ అయిన తర్వాత కనీసం చట్టం తనపని తాను చేసుకుపోతుందనే ఒకే ఒక్క మాట అని ఉన్నా…ఆమెకు అంతగా నష్టం జరిగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరినైనా చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారనే పేరు ఉందని, అఖిలప్రియ విషయంలో అది మరోసారి రుజువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు లేని అఖిలప్రియ విషయంలో టీడీపీ అవలంబిస్తున్న తీరుపై భూమా వర్గీయులు మండిపడుతున్నారు.