ప్రత్యేక హోదా అన్నది ఒక బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. దాని మీద ఎవరికి తోచినది వారు చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటిదాకా ఒకే మాట మీద నిలబడడం విశేషం. అక్కడ హోం మంత్రులు మారుతున్నారు. ఎన్నో విధానాలు మారుతున్నాయి. కానీ హోదా విషయానికి వచ్చేసారికి ట్యూన్ రైమింగ్ ఏదీ తప్పకుండా ఒకే ఒక మాట చెబుతున్నారు.
ఆ మాటే హోదా ఏపీకి ఇవ్వమంటే ఇవ్వబోమని, దానికి బదులుగా ఎన్నో నిధులు ఇచ్చేశామని, విభజన హామీలు కూడా పూర్తిగా నెరవేర్చామని చెబుతున్నారు. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హోదా మీద అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పినది కూడా అదే.
హోదా ఏ రూపేణా కూడా అసలు ఇవ్వలేమని తేల్చేశారు. దానికి ధీటైనవి ఎన్నో ఏపీకి కేంద్రం ఇప్పటికే అమలు చేసిందని కూడా నిత్యానందరాయ్ చెప్పారు. అందువల్ల హోదా గురించి మరచిపోవడమే బెటర్ అన్న తీరులో కేంద్రం చెబుతోంది అనుకోవాలి.
అయినా హోదా మీద కేంద్రం స్టాండ్ మారనపుడు ఎన్నిసార్లు అడిగినా ఇదే రకమైన చేదు జవాబు వస్తుంది. హోదా ఇవ్వడం ఇష్టం లేదు అని ఎక్కడా అనరు, 14వ ఆర్ధిక సంఘం మీద నెపం నెడతారు. ఇక రాజకీయంగా తేల్చుకుంటే హోదా వచ్చునో మానునో.
కానీ ఆ దిశగా చర్యలు లేవు. అలాంటపుడు ప్రత్యేక హోదా ఊసు మరచిపోవడమే మంచిది కదా. పదే పదే కేంద్ర పెద్దలు మీకు హోదా అదృష్టం లేదు అని ముఖం మీద చెప్పించుకోవాలా. హోదా అంటే సోది లోకి లేకుండా పోయిన విషయమని, ముగిసిన అధ్యాయమని అనుకుంటే సరిపోతుందేమో.