జగన్ కొత్త కేబినెట్ కూర్పునకు సంబంధించి రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ మంత్రి పదవులు ఇవ్వనని కొంత మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ కొత్తగా ఎవరికి ఇస్తాననే విషయంలో మాత్రం జగన్ గోప్యత పాటిస్తున్నారు. మొదటి నుంచి తనతో నడిచిన ఒకరిద్దరు నేతలకు మాత్రం ఈ దఫా విస్తరణలో తప్పక న్యాయం చేస్తానని సన్నిహితుల వద్ద జగన్ చెప్పినట్టు సమాచారం.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఈ దఫా తప్పక మంత్రి పదవి దక్కనుంది. ఈ మేరకు సీఎం నుంచి కాకాణికి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకాణి భారాన్ని మోశారు. అసెంబ్లీలోనూ, వెలుపల ప్రతిపక్ష పార్టీల్ని తన వాగ్దాటితో దీటుగా ఎదుర్కొంటారనే పేరు సంపాదించుకున్నారు.
నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. ఆ జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాల్ని గత సార్వత్రిక ఎన్నికల్లో జనం కట్టబెట్టారు. అందుకే ఆ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గీయుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఆ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ కీలకమైన నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. మరోసారి ఆయనకు రెన్యువల్ కష్టమని సమాచారం. అదే జిల్లా నుంచి పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా కాకాణితో పాటు మరొకరికి ఆ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనేది త్వరలో తేలనుంది.