పెగాసస్ సాఫ్ట్‌వేర్ అంశం కొన్ని నెలల క్రితం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఇటీవల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని విక్రయదారులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం చెలరేగింది. ఈ విషయమై నిగ్గు తేల్చేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.
వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలుపై ఏపీ బీజేపీలో పరస్పర విరుద్ధ ప్రకటనలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కల్తీ సారా ఎపిసోడ్‌తో పాటు ప్రజాసమస్యలను దారి మళ్లించేందుకే ఏపీ సర్కార్ పెగాసస్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చిందన్నారు. అంతేకాదు, పెగాసస్ అనేది లేనేలేదని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారని వారు గుర్తు చేయడం విశేషం.
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్సీల అభిప్రాయాలకు భిన్నమైన అంశాలను చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో జరిగిన పెగాసస్ స్పైవేర్ బాగోతంపై రాష్ట్ర బీజేపీ పెద్దలు అప్పుడే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. వ్యక్తిగత సమాచారం చోరీ, ఓట్ల తొలగింపుతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానం ఉందని అప్పట్లోనే బీజేపీ పేర్కొందన్నారు.
పెగాసస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. పెగాసస్‌పై చంద్రబాబును కాపాడే ప్రయత్నంలో ఏపీ బీజేపీ నేతల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది.