జనసేన సమీక్షలు.. ఈసారి పవన్ క్లారిటీ ఇస్తారా?

ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. కాబట్టి పొత్తు ఒప్పందాల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్ని జనసేన కోల్పోతుందనేది స్పష్టం. ఇది కాకుండా టీడీపీ వైపు కూడా సానుకూలంగా చూస్తున్నారు పవన్ కల్యాణ్. ఎవరు ఔనన్నా, కాదన్నా ఎన్నికల…

ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. కాబట్టి పొత్తు ఒప్పందాల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్ని జనసేన కోల్పోతుందనేది స్పష్టం. ఇది కాకుండా టీడీపీ వైపు కూడా సానుకూలంగా చూస్తున్నారు పవన్ కల్యాణ్. ఎవరు ఔనన్నా, కాదన్నా ఎన్నికల నాటికి జనసేన-బీజేపీ కూటమిలోకి టీడీపీ కూడా చేరిపోతుందనేది దాదాపు ఫిక్స్. కాబట్టి ఆ మేరకు కూడా జనసేన మరికొన్ని స్థానాల్ని వదిలించుకోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో.. జనసేన హోల్డ్ లో పెట్టుకునే నియోజకవర్గాలేంటి? ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరికి అవకాశం ఇస్తుంది? ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం వస్తుందంటున్నారు జనసేన కార్యకర్తలు. అటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కుడా పరోక్షంగా ఇదే చెబుతున్నారు.

ఉగాది తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయని ప్రకటించారు నాదెండ్ల. స్వయంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఈ సమీక్షలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇది ఏటా జరిగే తంతే, అంత కంగారు పడాల్సిన పనిలేదు. కానీ ఈసారి మాత్రం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఖరారు ఉండొచ్చనేది జనసేన ఇంటర్నల్ టాక్.

బీజేపీకి ఎన్ని స్థానాలు త్యాగం చేస్తాం, టీడీపీకి ఎన్ని సీట్లు అప్పగించుకుంటాం లాంటి విషయాల్ని పక్కనపెడితే.. కచ్చితంగా తమకంటూ కొన్ని నియోజకవర్గాల్ని ఉంచుకోవాలని పవన్ ఇప్పటికే నిర్ణయించారు. ఈసారి నిర్ణయాధికారం తన చేతిలోనే ఉంది కాబట్టి, వాటిని జోలికి టీడీపీ-బీజేపీ రావనేది పవన్ ఆలోచన. అలాంటి నియోజకవర్గాల్లో జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారనే క్లారిటీని ఉగాది తర్వాత ఇవ్వబోతున్నారు పవన్ కల్యాణ్.

ఆరు నూరైనా, నూరు ఆరైనా.. ఎవరితో పొత్తులు ఉన్నా, ఎన్ని సీట్లు కోల్పోయినా.. కొన్ని కీలక నియోజకవర్గాల్ని మాత్రం కొందరికి అప్పగించి, ఆ మేరకు వాళ్లకు విస్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారట పవన్ కల్యాణ్. ఇప్పట్నుంచే ఆ సెగ్మెంట్లలో వర్క్ చేసుకోవాలని.. తాము గెలిచి జనసేనను గెలిపించుకోవాలని క్లియర్ గా చెప్పబోతున్నారట. నిజానికి జనసేన క్యాడర్ కూడా ఈ మాట కోసమే ఎదురుచూస్తోంది.

గత ఎన్నికల టైమ్ లో భీమవరం, గాజువాక నుంచి చిత్తుగా ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలనే అంశంపై కూడా ఈ సమీక్షల్లో ఓ అవగాహనకు వస్తారట. పనిలోపనిగా నాగబాబును మరోసారి పార్టీలో యాక్టివ్ చేయడానికి కూడా పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. ఆయనకు ఓ నియోజకవర్గాన్ని కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రీసెంట్ గా నాగబాబు కూడా పరోక్షంగా తన రాజకీయ పునరాగమనంపై ప్రకటన చేశారు కూడా.

ఇలా ఈసారి జరగబోయే నియోజకవర్గాలవారీ సమీక్షా సమావేశాలతో జనసేనలో చిన్నపాటి కదలిక వచ్చేలా ఉంది. రీసెంట్ గా జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం విన్న తర్వాత క్యాడర్ లో కీలకమైన నేతలు చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. తమకు సీటు ఉంటుందా ఉండదా అనే అభధ్రతాభావంలో పడ్డారు. ఈ సమీక్షలతో క్లారిటీ వస్తే, అప్పుడిక యాక్టివ్ గా ఉండాలా వద్దా, ఖర్చు పెట్టాలా వద్దా అనే నిర్ణయానికి వీళ్లంతా రాబోతున్నారు.