వైసీపీ లిస్ట్ రెడీ.. టీడీపీ బేరాలు కూడా రెడీ!

సర్వేనే నమ్ముకోండి, జనాల్లో తిరగండి, లేకపోతే మొహమాటాలకు పోను అంటూ 2024 ఎమ్మెల్యే టికెట్ల విషయంమలో కరాఖండిగా తేల్చేశారు ముఖ్యమంత్రి జగన్. దీంతో టీడీపీ ఓ అడుగు ముందుకేసింది. సహజంగానే కొంతమంది జనాల్లోకి వెళ్లకుండా…

సర్వేనే నమ్ముకోండి, జనాల్లో తిరగండి, లేకపోతే మొహమాటాలకు పోను అంటూ 2024 ఎమ్మెల్యే టికెట్ల విషయంమలో కరాఖండిగా తేల్చేశారు ముఖ్యమంత్రి జగన్. దీంతో టీడీపీ ఓ అడుగు ముందుకేసింది. సహజంగానే కొంతమంది జనాల్లోకి వెళ్లకుండా వ్యాపారాలు చూసుకుంటూ పక్కరాష్ట్రాల్లో సెటిలైపోయిన వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. 

అంగీకరించడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇదే నిజం. అలాంటి వారితో ముందుగానే టచ్ లోకి వెళ్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ టికెట్ పై అనుమానం ఉంటే ముందే గోడ దూకేయాలని చెబుతున్నారు. తమ దగ్గర కూడా టికెట్లకు డిమాండ్ ఉందని, ముందే బాబుతో ఓ మాట మాట్లాడేసుకోవాలని, టికెట్ రిజర్వ్ చేసుకోవాలని తొందర పెడుతున్నారు.

అసంతృప్తులు ఉన్నారా..?

వైసీపీ నేతల్లో కొంతమంది స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేకుండా తమ వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయి ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారందరికీ ఫైనల్ వార్నింగ్ అంటూ, రెండేళ్ల ముందుగానే సెట్ రైట్ అవ్వాలంటూ జగన్ ఓ అవకాశాన్నిచ్చారు. వైసీఎల్పీ మీటింగ్ లో దిశా నిర్దేశం చేశారు. 

ఈ రెండేళ్లు కష్టపడి, జనంలో తిరిగితే.. తిరిగి అందరి మనసులు గెలవడం, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కొంతమంది మాత్రం ముందుగానే అస్త్ర సన్యాసం చేస్తున్నారని వినికిడి. కచ్చితంగా వచ్చే దఫా తమకు టికెట్ రాదు అనే అనుమానం కొంతమందిలో ఉంది. అంటే అలాంటి వారంతా టీడీపీ గాలానికి ఈజీగా చిక్కే అవకాశముంది.

రండి.. త్వరపడండి..

వైసీపీలో టికెట్ రాదు అనుకున్నవాళ్లు రెండేళ్ల అధికారాన్ని అప్పుడే వదిలిపెట్టుకుంటారా..? పోనీ వదిలిపెట్టుకున్నా పోయి పోయి టీడీపీలో చేరి పరువు పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. అందుకే ఆ అసంతృప్త బ్యాచ్ అంతా వేచి చూసే ధోరణిలో ఉంది. కానీ టీడీపీ మాత్రం టికెట్లు అయిపోతున్నాయి, రిజర్వ్ చేసుకోండి, అధినేతతో మాట్లాడండి అంటూ బేరాలు పెడుతోంది.

మొత్తమ్మీద టీడీపీ నాయకులు తమకు సొంత బలం లేదని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. వైసీపీ అసంతృప్తులతో నెట్టుకు రావాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పట్నుంచే బేరసారాలు మొదలుపెట్టారు.