ఒకే రోజు, ఒకే సమయం.. నిరసన చేసే దమ్ముందా?

జె బ్రాండ్ లిక్కర్ అని, నాటు సారా తయారీ అని ఒక ఎజెండా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. నిరసనలు వేర్వేరు చోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని స్థానిక…

జె బ్రాండ్ లిక్కర్ అని, నాటు సారా తయారీ అని ఒక ఎజెండా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. నిరసనలు వేర్వేరు చోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ తప్పుపడుతూనే ఉన్నారు. అయితే ఈ నిరసనలు, వారు దిగుతున్న ఫోటోలు, పేపర్లలో వార్తలు చూస్తున్న సామాన్యులకు ఒక చిన్న సందేహం కలుగుతోంది. 

ఒక కారణం గురించి పోరాటాలకు పిలుపు ఇచ్చి కొన్ని రోజుల పాటూ అక్కడక్కా చెదురుమదురుగా చేస్తూ ఉండడమేనా.? నిర్దిష్టంగా ఒకే రోజున ఒకే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా తమ పోరాట గళం వినిపించేలా తెలుగుదేశం పోరాడే పరిస్థితి అసలుందా? అని!

2019 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా అయిపోయింది. ఆ పార్టీ తరఫున ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు. గెలిచిన వారు కొందరు వైసీపీ పంచన సేద తీరుతుండగా.. మరికొందరు.. అసలు టీడీపీతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దుస్థితిలో నియోజకవర్గాల్లో మండలాల్లో పార్టీకి మిగిలిన కేడర్ కూడా చాలా తక్కువే. వారి పరిస్థితి దారుణంగా ఉంది. 

తెలుగుదేశం పిలుపు ఇస్తున్న ప్రజా ఉద్యమాలు, పోరాటాల సమయంలో వారి బలహీనత, కేడర్ లేమి ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. వారు ఏ కార్యక్రమం పిలుపు ఇచ్చినా మహా అయితే పదిమంది కార్యకర్తలు పచ్చ చొక్కాలు తొడుక్కుని, లేదా పచ్చ జెండాలు పట్టుకుని రోడ్డు మీద నిల్చుని మొబైల్ తో ఓ ఫోటో దిగుతారు. 

ఆ ఫోటోను మీడియా వారికి పంపేసి.. అక్కడితో ఎవరి తోవన వారు వెళ్లిపోతారు. అంతే తప్ప.. ప్రజా సమస్యల మీద ప్రభుత్వంలో కదలిక వచ్చేలాగా.. వారు చేస్తున్న నిర్దిష్ట పోరాటాలు అంటూ లేవు. పైగా ఏ ఊర్లో చూసినా.. పది ఇరవై మందికి మించి పార్టీ పిలుపు ఇచ్చే పోరాటాలకు స్పందిస్తున్న వారు లేరు. కొన్ని చోట్ల ఆ పది మందికి కూడా గతి లేదు. 

కనీసం అలాంటి పరిస్థితి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున, ఒకే సమయానికి పోరాటానికి పిలుపు ఇస్తే.. ఆ సమస్య మీద వారి గళం అట్టుడికిపోయేది. ఇప్పుడలా లేదు. దాంతో ఉద్యమాలకు కూడా రెండు మూడురోజులు, వారం రోజుల ప్రణాళికలు వేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి పదిమంది కార్యకర్తలు ఉంటారనుకుంటే.. ఒక మండలంలో ఒక రోజున, ఇంకో మండలంలో ఇంకోరోజున ఆ పదిమంది మాత్రమే కనిపిస్తూ.. ఫోటోలు దిగుతున్నారు. 

ఎవరో ఒక నాయకుడు కోఆర్డినేట్ చేసి అందరినీ పోగేస్తే తప్ప కార్యక్రమం జరగడం లేదు. ఒకేసారి రెండుమూడు చోట్ల జరపానుకుంటే అన్ని చోట్లా కోఆర్డినేట్ చేసేవారికి దిక్కులేదు. ఒకచోట పూనుకున్న వాడు మరోచోటకు వెళ్లి అందరినీ పిలిస్తే తప్ప జెండా పట్టుకుని రోడ్డు మీద పది నిమిషాలు నిలబడడానికి ఎవరూ రావడం లేదు. ఇదీ అసలు పరిస్థితి. 

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఉద్యమం, ఒకే రోజు ఒకే సమయంలో నిర్వహించే దమ్ము పార్టీకి పోయింది. మహిళల ఆత్మగౌరవ సభల పేరు పెట్టినా, లిక్కర్ వ్యతిరేక పోరాటాలు చేసినా.. రోజులు నెలల తరబడి వాటిని సాగగదీస్తూ చేస్తూ ఉండడానికి ఇదే కారణం అని పలువురు విశ్లేషిస్తున్నారు.