మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన దయాకర్ రెడ్డి మూడుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కొత్తకోట దయాకర్‌రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురం. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చిన ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం, ప్రస్తుతం ( దేవరకద్ర నియోజకవర్గం) నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి చేతిలో 6751 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1994, 1999 ఎన్నికల్లో వీరారెడ్డి పైనే విజయం సాధించారు.
2009లో కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్.. ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దంపతులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టి రికార్డ్ సృష్టించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మరియు 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.