చేతగానితనాన్ని కూడా కవరింగు చేసుకోవడంలో పవన్ కల్యాణ్ తెలివితేటలను గమనిస్తే.. కొత్త సామెతలు పుట్టించాలని అనిపిస్తుంది. ఎందుకలా.. అని ఆశ్చర్యపోవద్దు. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల్లో కూడా రంగంలోకి దించాలని అనుకున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో సైతం వారాహి యాత్ర ఉంటుందని సెలవిచ్చారు. 1300 మంది బలిదానాలతో సాకారం అయిన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలను అందుకు తమ వంతు పాటు పడాలని పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశాన్ని స్పష్టం చేసిన పవన్, కుదిరితే ఇతర పార్టీలతో పొత్తులతో పోటీకి వెళదాం, లేకుంటే ఒంటరిగానే పోటీచేద్దాం అని నేతలతో చెప్పడం విశేషం. నిజానికి పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగస్వామి. ఆయన కేంద్రంలో తనకు సన్నిహితులు అని చెప్పుకునే పెద్దలతో ఏపీ రాజకీయాల గురించి మరో సంగతి మాట్లాడకపోవడం వలన.. ఇవాళ ఇలా మాట్లాడాల్సి వస్తోంది. పొత్తులు కుదురుతాయేమో చూద్దాం అని చర్చించుకోవాల్సి వస్తోంది.
సాధారణంగా అయితే భాగస్వామ్య పార్టీ గనుక.. ఖచ్చితంగా రెండు పార్టీలు సీట్లు పంచుకుని పోటీచేయాలి. కానీ.. తెలంగాణలో బిజెపితో ఒక్క రోజు అయినా పవన్ కల్యాణ్ భేటీ అయిన సందర్భాలు లేవు. గుడులకు వెళ్లిన సందర్భాల్లో తప్ప.. ప్రజల గురించి మాట్లాడినది కూడా లేదు. ఇప్పుడు పార్టీ సమావేశం పెట్టుకుని ఎన్నికల గోదాలోకి దిగడానికి 26 నియోజకవర్గాలకు జనసేన ఇన్చార్జిలను కూడా పవన్ ప్రకటించారు.
జంటనగరాల్లో సుమారు ఏడు నియోజకవర్గాలతో పాటు, మిగిలిన రాష్ట్రమంతా కలిపి మొత్తం 26 సెగ్మెంట్లకు జనసేన ఇన్చార్జిల పేర్ల జాబితా విడుదల చేశారు. వీరిలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి, సికింద్రాబాద్ ఎంపీగా పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన నేమూరి శంకర్ గౌడ్ కూడా ఉన్నారు. ఆయన మినహా అందరూ రాజకీయాలకు కొత్తవారే కావడం విశేషం.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి ఆవకాశం ఇవ్వరు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని’’ అనడమే తమాషా. కొత్త వారిని ఇన్చార్జిలు చేయడం అనేది జనసేన బలహీనత. ఆ పార్టీకి యావత్తు తెలంగాణలో రాజకీయ అనుభవం ఉన్న, ప్రజలకు కాస్త పరిచితమైన నాయకుడు ఒక్కడు కూడా లేరు.
తన పార్టీకి సీనియర్ నాయకుల గతిలేకపోగా.. దానిని కవరింగు చేసుకుంటూ.. ఏపార్టీ చేయని విధంగా ఇంతమంది కొత్తవారికి తాను అవకాశం ఇస్తున్నానంటూ పవన్ కల్యాణ్ డప్పు కొట్టుకోవడం చాలా కామెడీగా ఉంది. ‘లేస్తే మనిషిని కాను’ అని ప్రగల్భాలు పలికే ఆర్భాటశూరులు కూడా పవన్ కు సాటిరారు అని జనం నవ్వుకుంటున్నారు.