పవన్ కల్యాణ్ యాత్ర చేయదలచుకుంటున్నారా? రాద్ధాంతం చేయదలచుకుంటున్నారా? యాత్ర ద్వారా రాద్ధాంతం, యాత్ర చేయకపోతే అంతకంటె పెద్ద రాద్ధాంతం చేయాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే వారాహి వాహనారూఢుడై ఉభయగోదావరి జిల్లాలు పర్యటించాలని అనుకున్నప్పుడు.. దానికి సంబంధించి పోలీసు అనుమతులు తీసుకోవాలనే స్పృహ ఆయనకు ఉండాలి. అంతవరకు జాగ్రత్తగానే పోలీసులకు లేఖలు ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం.. ఆయన యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడానికి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఇవ్వాలని పోలీసులు అడుగుతోంటే.. జనసేన నాయకులు అతి చేస్తున్నారు. పోలీసులు తమను వేధిస్తున్నట్టుగా యాత్రకు ముందే ప్రచారం మొదలెడుతున్నారు. అనుమతులు కోసం కోర్టును ఆశ్రయించనున్నారు. తద్వారా డ్రామాను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
వారాహి యాత్రకు అనుమతులు ఇవ్వబోమని పోలీసులు అనలేదు. కేవలం నిబంధనలను పాటించాలని మాత్రమే అంటున్నారు. దీనికి కూడా వారికి ఇష్టం లేకపోతే ఎలా అని ప్రజలు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాదు. ప్రజల్లో చాలా క్రేజ్ ఉన్న సినిమా నటుడు కూడా. అంత చిన్న పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆయనను చూసినప్పుడు.. ఆయన యాత్ర విషయంలో భద్రత గరించి పెద్ద టెన్షన్ అక్కర్లేదు. కానీ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. వేల మంది సినిమా అభిమానులు ఎగబడే క్రేజ్ పవన్ కల్యాణ్ కు ఉంది. అలాంటప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియని సంగతి.
జనంలోంచి ఎవరో ఒకరు ఏదో ఒక ఆకతాయి పనిచేసినా సరే.. ఆయన రాజకీయ నాయకుడు గనుక.. నిందలు అధికార పార్టీ మీదనే పడుతాయి. పోలీసుల వైఫల్యం కింద రంగు పులుముతారు. పోలీసులు వైసీపీతో కుమ్మక్కు అయి తమ మీద దాడులు చేయిస్తున్నారని అంటారు. ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలే. ఆ నేపథ్యంలో.. పవన్ తన యాత్రకు సంబంధించి నిర్దిష్టమైన, మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
దీనిమీద కూడా కోర్టుకు వెళ్లడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి. ప్రోగ్రాం వివరాలు ఇవ్వడానికి ఇంకా ఒకరోజు సమయం ఉంది. కోర్టులో పిటిషన్ వేయడంపై పెట్టే శ్రద్ధ మినట్ టూ మినిట్ ప్రోగ్రాం తయారుచేసి పోలీసులకు ఇవ్వడంపై పెడితే.. అనుమతులు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి.
పోలీసులు అనుమతి ఇస్తే తాము రాద్ధాంతం చేయడానికి, తమను ప్రభుత్వం వేధిస్తున్నట్టుగా నిందలు వేయడానికి ఆస్కారం ఉండదని జనసేన నాయకులు జంకుతున్నట్టుంది. కోర్టుకు వెళ్లడం కూడా నిందలు వేయడానికి ఒక వ్యూహమేనని ప్రజలు అనుకుంటున్నారు.