అమెరికా పతనానికి బీజం పడిందా?

“దేశమంటే మట్టి కాదోయ్- దేశమంటే మనుషులోయ్” అన్నాడు గురజాడ. ఇది ఒక్క భారతదేశానికే కాదు, ప్రతి దేశానికి వర్తిస్తుంది. ఏ దేశమైతే తన భావిపౌరుల్ని నిర్వీర్య పరుస్తుందో ఆ దేశం దారుణంగా పతనమౌతుంది. అటువంటి…

“దేశమంటే మట్టి కాదోయ్- దేశమంటే మనుషులోయ్” అన్నాడు గురజాడ. ఇది ఒక్క భారతదేశానికే కాదు, ప్రతి దేశానికి వర్తిస్తుంది. ఏ దేశమైతే తన భావిపౌరుల్ని నిర్వీర్య పరుస్తుందో ఆ దేశం దారుణంగా పతనమౌతుంది. అటువంటి దేశం క్రమంగా పరాధీనమౌతుంది. 

ఇప్పుడు మనం చెప్పుకునేది అగ్రరాజ్యం అమెరికా గురించి. “నదీనాం సాగరోగతి” అన్నట్టు ప్రతి దేశంనుంచి ఎంతో కొంత మంది ప్రజలు పశ్చిమ దిశగా ప్రవహించి అమెరికాలో కలుస్తున్నారు. డాలరుకున్న విలువ అలాంటిది. అయితే ఇప్పుడు పరిస్థితి మారేలా ఉంది. 

అమెరికాలో మునుపటి సుఖాన్ని ఇప్పుడు పొందడం లేదంటున్నారు అక్కడ ఉంటున్న ప్రజలు. ప్రధాన కారణాలు రెండు మూడున్నా వాటిలో మొదటిది డ్రగ్స్. ఇవి అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్యన దేశం మొత్తం గంజాయిని లీగలైజ్ చేసి పాడేసింది ప్రభుత్వం. దాంతో విచ్చలవిడిగా జనం దీనిని ఆస్వాదిస్తున్నారు. వారిలో అగ్రభాగం 15-40 వయసు మధ్యవాళ్లే ఉన్నారు. ఆ గంజాయి మత్తులో ఆరోగ్యంతో పాటూ కొందరు విచక్షణ కూడా కోల్పోతున్నారు. అసలే గన్ కల్చర్ ఉన్న దేశంలో గంజాయి కూడా లీగలంటే ఎలా ఉంటుంది? “అసలే కోతి, పైగా కల్లు తాగింది” అన్నట్టుగా అక్కడి ప్రజలు కొందరు డ్రగ్ బారిన పడి ఉన్మాదావస్థలో ఎవర్ని పడితే వాళ్లని విచక్షణా రహితంగా కాల్చిపారేస్తున్నారు. 

కక్షల వల్ల జరిగే హత్యలు, సైకోలు చేసే హత్యలు వేరు. వాటిల్లో ప్రభుత్వం ప్రమేయం నేరుగా ఉండదు.  కానీ లీగలైజ్ చేసిన డ్రగ్ ని వాడి ప్రజలు నేరాలు చేస్తుంటే శిక్షలో ప్రభుత్వానికి కూడా భాగముండాలి. 

మొన్నీమధ్య అమెరికాలోని ఒక నగరంలో ఒక కాలేజ్ స్టూడెంట్ లేడీస్ హాష్టల్లోకి చొరబడి ఒక అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆమె ప్రతిఘటించి వెంటనే 911 కి కాల్ చేస్తే పోలీసులొచ్చి కాపాడారు. మర్నాడు పోలీసులకి అతను చెప్పిన సమాధనం ఒక్కటే…గంజాయి మత్తులో ఏం చేస్తున్నానో తెలీక చేసానని. 

గంజాయి సేవించడం నేరం కాదు కాబట్టి సేవించానన్నాడు. ఆ మత్తులో చేయకూడని పని చేసానని ఒప్పుకున్నాడు. అంటే గంజాయి తీసుకునే అవకాశం లేకపోతే ఆ పని చేసేవాడు కాదనేగా! అందుకే ఈ విద్యార్థి చేసిన నేరంలో గంజాయిని లీగలైజ్ చేసిన ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందనే చెప్పాలి. 

ఇండియాలో జరిగిన చాలా రేపులకి మద్యమే ప్రధాన కారణం. ఢిల్లీలో నిర్భయ కేసైనా, హైదరాబాదులో దిశ ఘటన అయినా మద్యం సేవించిన మత్తులో విచక్షణ కోల్పోయి చేసిన నేరాలే. కనుక మద్యం అమ్మి సొమ్ము చేసుకునే ఢిల్లీ, తెలంగాణా ప్రభుత్వాలకి..అలా చేయడానికి వెసులుబాటు కల్పించే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ రేపుల్లో పాత్ర ఉన్నట్టే. మద్యానికే ఇలా ఉంటే ఇక గంజాయి కూడా లీగలైజ్ అయిన అమెరికా పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

గంజాయి మత్తులో స్టన్ గన్ పట్టుకుని ఏ షాపింగ్ ఏరియాలోకో చొరబడి కాల్చి పారేసే వాళ్లు, ఏ స్కూలుకో వెళ్లి పిల్లల్ని పొట్టన పెట్టుకునే వాళ్లు..మనకి ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నారు. రానున్న కాలంలో వీళ్ల సంఖ్య పెరిగేదే తప్ప తరిగేది కాదు. 

అసలే కుటుంబాల్లో పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టకుండా యుక్త వయసురాగానే స్వేచ్ఛనివ్వాల్సిన కల్చరుతో కొనసాగుతున్న దేశం అమెరికా. అమెరికాలోని భారతీయులు తమ పిల్లలు టీనేజ్ కి రాగానే మునుపటి కంటే ఎక్కువ భయపడుతున్నారు….దేనికో కాదు ఈ గంజాయి సంస్కృతి లీగలవ్వడం వల్లనే. 

అమెరికాలో ఆర్ధికమాంద్యం పెరగడం వల్ల ధరలు మిన్నంటి ఉండడం, గన్ కల్చర్, లీగలైజ్ అయిన డ్రగ్స్ సంస్కృతి…అన్నీ కలిపి ఈ దేశంపై భయాన్ని పెంచి మోజుని తగ్గిస్తున్నాయి. అమెరికన్ డాలరు కాకపోతే సింగపూర్ డాలరో, అరబ్ దిర్హాములో దినార్లో నయమనుకుని ఆ దిశగా అడుగులు వేసే ప్రపంచజనాభా కూడా కనిపిస్తోంది. దీనివల్ల అమెరికా పతనం నెమ్మదిగా అయినా జరిగితీరుతుంది. ప్రస్తుతానికి గంజాయి లీగలైజ్ అవ్వడంతో ఆ పతనానికి బీజం పడిందనుకోవాలి. 

“అవకాశాల భూమి” అని పిలిపించుకుంటూ అగ్రదేశంగా ఉన్న అమెరికాకి ప్రపంచ జనాభా ఆ స్థానాన్ని ఇంకొన్నాళ్లు పదిలంగా కొనసాగించాలంటే సత్వరం గంజాయిని నిషేధించి, గన్ కల్చర్ కి కూడా తెర దించాలి. దీనికి ఉద్యమాలు ఆల్రెడీ చిన్నగా మొదలయ్యాయి. అవి మరింత ఊపందుకోవాలి, బలమైన నాయకుడొచ్చి ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి జరిగేదాకా ఒక్కటే మాట- “అమెరికా ఈజ్ నాట్ సేఫ్”. 

హరగోపాల్ సూరపనేని