అటు రాష్ట్రానికి ఒక చివర్న శ్రీకాళహస్తి సభలో జెపి నడ్డా గానీ, ఇటు ఇంకో చివర్న విశాఖపట్నం వేదికగా అమిత్ షా గానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఏ రేంజిలో విరుచుకుపడ్డారో ప్రజలందరూ గమనించారు. నిజానికి జగన్ సర్కారు వారు చెప్పినంత ఘోరమైన, అవినీతిమయమైన పరిపాలన సాగిస్తున్నట్లయితే గనుక.. ఇన్నాళ్లుగా ఆ పార్టీ నాయకులు నోరు మెదపకుండా ఎందుకు ఉండిపోయారు? అని కూడా ప్రజలు సందేహించారు.
ఆ సంగతి పక్కన పెడితే- అమిత్ షా కు వైఎస్సార్ సీపీ తరఫునుంచి ఎలాంటి జవాబు చెప్పారు. ఇది చాలా కీలకమైన సంగతి.
సూటిగా చెప్పాలంటే బిజెపి నాయకుల విమర్శల పట్ల ముఖ్యమంత్రి జగన్ స్పందన చాలా పేలవంగా ఉంది. విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భాజపా తనకు అండగా ఉండకపోవచ్చునని సెలవిచ్చారు. వాళ్లను నమ్ముకోలేదని, ప్రజలే తన సైన్యమని చెప్పుకొచ్చారు. ప్రజలు ఆయన సైన్యం కావడం సంగతి సరే.. ఆయన బిజెపి నమ్ముకున్నారని, భాజపా ఆయనకు అండగా నిలుస్తుందని ప్రజల్లో ఎవరు అసలు అనుకున్నారు? ఎవరూ అనుకోని విషయానికి జగన్ వివరణ ఎందుకు ఇస్తున్నారు.? ఆయనకే అర్థంకావాలి.
అంతకు మించి.. నడ్డా, అమిత్ షాలను ఉద్దేశించి నోరుమెదపకుండా.. తన పార్టీ మంత్రులను కీలక నాయకుల్ని పురమాయించారు జగన్.అమిత్ షా మీద వైసీపీలో సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కలిసి విరుచుకుపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తెగబడడం గురించి నిలదీస్తున్నారు. నడ్డా మీద వైసీపీ నాయకులు తొలిరోజు విరుచుకుపడిన డోసేజీకి, ఇవాళ అమిత్ షా మీద వారు ఎగిరిపడుతున్న డోసేజీకి చాలా ఉంది.
సామెత చెప్పినట్టుగా, తమలపాకుతో బిజెపిని ఒకటి కొడుతూ, అదే రకం విషయాల గురించి తెలుగుదేశం, జనసేన పార్టీలను మాత్రం తలుపు చెక్కతో కొడుతూ వైసీపీ సర్కారు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. అసలే భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ కు లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని ప్రజల్లో విమర్శలు చెలామణీలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కమల నాయకుల మీదికి కౌంటర్ ఎటాక్ చేయడంలో వైసీపీ నేతలు సూటిగా వ్యవహరించలేకపోతున్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదంటూ- అసలు మా రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత మీకుందా అంటూ గట్టిగా బిజెపి నేతలను ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలియదు. బిజెపి వైఫల్యాలు వంచనలు ఇంకా బోలెడు ఉన్నాయి. వాటిని పచ్చిగా ఎండగట్టడం మీద జగన్ సచివులు దృష్టి పెట్టాలి. బిజెపి నాయకులు చాలా దారుణంగా జగన్ సర్కారును విమర్శిస్తుండగా.. వారి మీద పైపైనే కౌంటర్లు ఇస్తే జనం అనుమానిస్తారు.