ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది డిజాస్టర్ అని చెప్పక తప్పదు. విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నప్పటికీ.. ప్రీ-రిలీజ్ బిజినెస్ అంకెలతో పోల్చి చూసుకుంటే మాత్రం ఈ వీకెండ్ ముగిసేసరికి సినిమాకు అటుఇటుగా 60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా ఉంది.
ఊహించని విధంగా రాధేశ్యామ్ డిజాస్టర్ అవ్వడంతో, రెబల్ స్టార్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఓవైపు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ను ట్రోల్ చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల అభిమానుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఇద్దరు హీరోల అభిమానులకు మధ్య జోరుగా మాటల యుద్ధం సాగుతోంది.
రాధేశ్యామ్ రిలీజ్ అయ్యే టైమ్ కు థియేటర్లలో భీమ్లానాయక్ ఉంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు వసూళ్లు తగ్గుతాయనే భయంతో.. చాలామంది పవన్ ఫ్యాన్స్, రాధేశ్యామ్ కు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారనేది ప్రభాస్ ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. రాధేశ్యామ్ కు థియేటర్లు తగ్గడం వెనక చాలా లాబీయింగ్ నడిచిందని, కేటాయించిన థియేటర్లలో కూడా నెగెటివ్ టాక్ వచ్చేలా చేసి పవన్ ఫ్యాన్స్ బాగా దెబ్బకొట్టారని అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.
మరోవైపు అల్లు అర్జున్ అభిమానులపై కూడా గుస్సాగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బన్నీ, ప్రభాస్ మధ్య వైరం ఇప్పటిది కాదు. చాన్నాళ్లుగా ఈ రెండు ఫ్యాన్ గ్రూప్స్ మధ్య అభిప్రాయబేధాలున్నాయి. సందు దొరికితే చాలు ట్విట్టర్, ఫేస్ బుక్ లో కొట్టుకోవడానికి వీళ్లు రెడీగా ఉంటారు. పవన్ ఫ్యాన్స్ తర్వాత తమ సినిమాను బాగా డ్యామేజ్ చేసింది అల్లు అర్జున్ ఆర్మీనే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ అభిమానులు.
ఈ ఫ్యాన్ వార్స్ ఎలా ఉన్నప్పటికీ.. రాధేశ్యామ్ లో కంటెంట్ కరెక్ట్ గా లేదనేది న్యూట్రల్ గా అందరూ ఒప్పుకున్న అంశం. ఈ విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నప్పటికీ.. పవన్-బన్నీ ఫ్యాన్స్ మరింత డ్యామేజీ చేశారనేది వాళ్ల ఆరోపణ. బహుశా.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యేంతవరకు ఈ సోషల్ మీడియా వార్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి.