తమ సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీఎంగా చూడాలని పరితపిస్తున్న మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ఉన్నట్టుండి జగన్ కేసులపై న్యాయపోరాటం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ హైకోర్టు చీవాట్లు పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రచారం కోసం వ్యాజ్యం వేశారా? అని తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం నిలదీయడం విశేషం.
రాజకీయంగా వైఎస్ జగన్‌ను హరిరామజోగయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మనసంతా కుల బీజాల్ని నాటుకున్న హరిరామ జోగయ్య జీవిత చరమాంకంలో కాపులను ఉద్ధరిస్తానని ముందుకొచ్చారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు బహిరంగంగానే మీరే ముఖ్యమంత్రి కావాలంటూ విన్నవించారు.
ప్రస్తుతానికి వస్తే…. మరోసారి హరిరామ జోగయ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌పై కేసుల విచారణను తేల్చేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అయితే వ్యక్తిగత కేసుల విచారణను పూర్తి చేయాలంటూ పిల్ వేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రిజిస్ట్రీ పిల్‌ను వుంచారు.
రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారం నేతృత్వంలోని ధర్మాసనం చేగొండి తరపున వాదనలు వినింది. విచారణ వేగంగా జరిగేలా సంబంధిత విచారణ సంస్థను కోరారా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా పీపీని ఆదేశించేలా సీబీఐ డైరెక్టర్‌ను కోరారా? సీబీఐ డైరెక్టర్‌ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకొచ్చారని హరిరామజోగయ్యను ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రచార ప్రయోజనాల కోసం పిల్ వేశారా? అని ఘాటు ప్రశ్నతో హరిరామజోగయ్యకు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. దీంతో హరిరామజోగయ్య తరపు న్యాయవాది బిత్తరపోవాల్సిన పరిస్థితి. పిల్ విచారణ అర్హతపై వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువును న్యాయవాది కోరడం గమనార్హం. దీంతో విచారణను వచ్చే నెల ఆరో తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.