తనకే ఓట్లు వేసి, మరోసారి అధికారం కట్టబెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్ చేయడం లేదు. తన పాలన నచ్చితే మరోసారి అధికారం ఇస్తారని జగన్ నమ్ముతున్నారు.
జనరంజక పాలన చేయకపోయి వుంటే, తప్పకుండా తనను ఇంటికి పంపుతారని జగన్ ఆలోచన. గత కొంత కాలంగా జగన్ ప్రసంగాల్ని పరిశీలిస్తే… రానున్న ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకే జగన్ ఆప్షన్ ఇవ్వడాన్ని చూడొచ్చు.
పల్నాడు జిల్లా క్రొసూరులో విద్యా కానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో వైఎస్ ప్రసంగిస్తూ… మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండని మాత్రమే విజ్ఞప్తి చేశారు.
నాలుగేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్లకు పైబడి నిధుల్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేశానని జగన్ చెబుతున్నారు. ఏదో రకంగా ప్రతి ఇంటికి లబ్ధి కలిగించానని ఆయన ధీమాగా ఉన్నారు. తన పాలనలో ప్రయోజనం పొందిన వారెవరైనా మరోసారి తననే కోరుకుంటారనేది ఆయన నమ్మకం. అందుకే జగన్ పదేపదే తన పాలనలో మంచి జరిగితేనే ఆదరించాలని విజ్ఞప్తి చేయడం.
ఇవాళ్టి సభలో మరోసారి చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లే అని ధ్వజమెత్తారు. చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం అని అన్నారు. రాబోయేది కురుక్షేత్ర సంగ్రామంగా అభివర్ణించారు. అందులో తనకు దుష్ట చతుష్టయం అండ అవసరం లేదన్నారు. అలాగే బీజేపీ అండ కూడా అవసరం లేదని తేల్చి చెప్పారు. పేద ప్రజల అండ వుంటే చాలన్నారు. మీరే నా ధైర్యం, బలం అని ప్రజలనుద్దేశించి అన్నారు.
ఎన్నికలకు ముందు వాగ్దానం, ఆ తర్వాత మోసం చేయడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, కుట్ర, దగ అని తూర్పారపట్టారు. రాయలసీమ డిక్లరేషన్ అని, గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ప్రకటనలిస్తున్న చంద్రబాబునాయుడు …14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు గాడిదలు కాసారా? అని నిలదీశారు.