మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడిపై మంత్రి పేర్ని నాని పంచ్ విసిరారు. ఇటీవల నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీనుద్దేశించి కొత్తపల్లి సుబ్బరాయుడు మాట్లాడుతూ నర్సాపురాన్ని వైసీపీ ఎమ్మెల్యే ముదుసరి ప్రసాద్‌రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రసాద్‌రాజుకు మద్దతు ఇచ్చి, గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నానని, అన్నంత పని చేసి వార్తల్లో నిలిచారు.
ఇవాళ పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మండిపడ్డారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి సభా సమయాన్ని టీడీపీ వృథా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సభ్యులు ఆకతాయినంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ వాళ్ళు శాసనసభ్యులా? ఇక్కడికి వచ్చి ఏమి చేద్దాం అనుకుంటున్నారని నిలదీశారు. ఇంత గాలిగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. గాలితనం చేయడం, మళ్ళీ బొంకడం టీడీపీ నేతలకే చెల్లుతుందన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవల వైసీపీని గెలిపించి తప్పు చేశామనడంపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు.
సుబ్బరాయుడి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు నాని తెలిపారు. సుబ్బారాయుడు చెప్పుతో కోట్టుకోవాలి అంటే చాలా సార్లు కొట్టుకోవాలని మంత్రి పేర్నినాని దెప్పి పొడిచారు. ఎందుకంటే కొత్తపల్లి సుబ్బరాయుడు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి, ఆ తర్వాత మళ్లీ టీడీపీ, అనంతరం వైసీపీలోకి వెళ్లారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొత్తపల్లి సుబ్బరాయుడిపై పేర్ని నాని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.