సమీక్ష: అల్లుడు అదుర్స్
రేటింగ్: 1.5/5
బ్యానర్: సుమంత్ మూవీ ప్రొడక్షన్స్
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఎమాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్‌రాజ్, సత్య, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్ రౌతు
విడుదల తేదీ: జనవరి 14, 2021
సినిమా ఎంత బాలేకపోయినా కానీ సమీక్షించుకోవడానికి ఏదో ఒక టాపిక్ వుంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కాదు. అలాంటి తల, తోక లేని సినిమానే అల్లుడు అదుర్స్. ప్రతి క్యారెక్టర్ కూడా ఏ సన్నివేశానికా సన్నివేశం తగ్గట్టు బిహేవ్ చేస్తుంటుందే తప్ప ఏ పాత్రకీ పాత్రచిత్రణ అంటూ వుండదు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మొదటి సన్నివేశం నుంచే తన హీరోను తడవకో రకంగా చూపించి, అదే తన క్యారెక్టరైజేషన్ అని చెప్పిస్తాడు.
నటీనటుల ఆంగికం, వాచకం చూస్తేనే దర్శకుడు ఎంత అతి కోరుకుంటున్నాడనేది అర్థమవుతుంది. ప్రకాష్‌రాజ్ లాంటి మేటి నటుడు కూడా దర్శకుడి అభీష్టం మేరకు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా పిచ్చి చేష్టలు చేస్తూ వుంటే ముందున్నది మొసళ్ల పండగ అనిపిస్తుంది. ఒక్కటని కాదు ప్రతి సన్నివేశంలోను పైత్యానికి పీక్స్ చూడవచ్చు. పెద్ద పండక్కి సినిమాకొచ్చే ఆడియన్స్ మైండ్ సెట్ మామూలు సినిమా లవర్స్ కి భిన్నంగా వుంటుంది. వీళ్లలో చాలా మంది ఒక నాసి రకం జోక్ చెప్పినా చాలు కితకితలు పెట్టేసుకుని నవ్వేసుకోవడానికి రెడీగా వుంటారు. బహుశః అందుకేనేమో మైండ్‌లెస్ ఎంటర్టైనర్లను పండుగ సినిమాలని ట్రేడ్ పండితులు అభివర్ణిస్తుంటారు.
అయితే అలాంటి అతి తక్కువ అంచనాలతో, అత్యల్పమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ వున్న వాళ్లతో కూడా ‘అల్లుడు అదుర్స్’ అతి చేస్తున్నాడు భయ్యా అనిపిస్తాడు. సెన్స్లెస్నెస్ అనేది కూడా ఒక కమర్షియల్ ఫ్యాక్టరే అనేది చాలా సక్సెస్ఫుల్ సినిమాలు నిరూపించాయి కానీ అది కూడా శృతి మించితే ఎలా వుంటుందో, నిజ జీవితంలో గౌరవభావం కలిగించిన సోను సూద్లాంటి రియల్ హీరోలు కూడా తెరపై సర్కస్ క్లౌన్స్లా ఎందుకనిపిస్తారో ఈ చిత్రం చూపిస్తుంది. ప్రతి డైలాగ్‌లోను ఏదో ఒక ప్రాస వుండి తీరాలి లేదంటే సెన్సార్ వాళ్లు ఫైనేసేస్తారు, ఆడియన్స్ టికెట్ డబ్బులు వెనక్కు అడుగుతారేమో అన్నట్టుగా సంతోష్ శ్రీనివాస్ పడిన ప్రయాస అంతా ఇంతా కాదు.
ప్రేమ గురించి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చే నిర్వచనాలకు అయితే ఆ ప్రేమకే కనుక ప్రాణముంటే సిగ్గుతో చచ్చిపోయుంటుంది. మాట మీద నిలబడని పాత్రలు సరే, అసలు వెన్నెముకే లేనట్టున్న ఇలాంటి పాత్రలు తెర నిండా వున్న ఈ సినిమాలో కామెడీ కోసమని తొక్కని అడ్డదారి లేదు. వేయించని వెకిలి వేషం లేదు. మామూలుగా ఇలాంటి సినిమాలు చూస్తున్నపుడు సమయం, డబ్బు వృధా అయిపోయాయనే బాధ, అసహనం వస్తాయి. కానీ ఈ చిత్రంలో డబ్బులు తీసుకుని నటించిన వాళ్లను చూస్తే ‘పాపం కదా’ అంటూ జాలి కలుగుతుంది. ఆ స్థాయిలో వారితో దర్శకుడు కామెడీ పేరిట నానా రకాల వేషాలు వేయించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకుడిపై విపరీతమైన నమ్మకం వున్నట్టు చాలా ఇన్వాల్వ్ అయిపోయి నటించాడు. ప్రతి సీన్లో, ఫైటులో, పాటలో తనవంతు ఎఫర్ట్ పెట్టాడు. డైలాగ్ డెలివరీపై ఇంకా వర్క్ చేయాల్సి వుంది. నభా నటేష్ ప్రతి సినిమాలోను ఈ తరహా పాత్రలే పోషిస్తోంది. అను ఎమాన్యుయేల్ క్యారెక్టర్ చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు ప్రకాష్‌రాజ్, సోను సూద్ పవర్ఫుల్ విలన్లుగా పరిచయమై మలి సన్నివేశంలోనే కమెడియన్లను మించిన జోకర్లను తలపించే పాత్రలు పోషించారు. సత్య క్యారెక్టర్‌ను బలవంతంగా కథలోకి ఇరికించడమే కాకుండా ఎలాగయినా నవ్వించి తీరాలని పరీక్ష పెట్టినట్టున్నారు.
దేవిశ్రీప్రసాద్ బాణీలు ఏమాత్రం ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఒక్కటీ మెప్పిస్తుంది. విజువల్స్ చాలా రిచ్‌గా వున్నాయి. నిర్మాత బాగా ఖర్చు పెట్టేసారని ఏ పాట చూసినా అర్థమవుతుంది. సంతోష్ శ్రీనివాస్ ఇంకా ‘కందిరీగ’ లాంటి సినిమా మరొకటి తీయాలనే ప్రయత్నంలోనే వున్నట్టనిపిస్తుంది. రభస, హైపర్ మిస్‌ఫైర్ అయినప్పటికీ అతడు ఇంకా అదే ఫార్ములాని పట్టుకుని వేలాడుతున్నాడు. కాలం చెల్లిపోయిన ఈ శ్రీను వైట్ల ఫార్ములాను ఇప్పుడు అందరు దర్శకులు విడిచిపెట్టేసారు. దానికి హారర్ ఎలిమెంట్ జోడిస్తే వర్కవుట్ అయిపోతుందని నమ్మాడో ఏమో ఆ సన్నివేశాలను సుదీర్ఘంగా సాగదీసి కనీసం పండగ ప్రేక్షకులని కూడా నవ్వించలేకపోయాడు.
కథే లేకుండా ఇలాంటి అతి హేయమైన కంటెంట్‌తో నిర్మాతను నమ్మించి, హీరోను ఒప్పించి, పేరున్న నటులను తీసుకొచ్చి… ఇంత ఖర్చు పెట్టించి సినిమా తీయడం కూడా ఒక ఆర్టే అనుకోవాలి. ఆ తెలివితేటల్లో కొన్ని ఒక మంచి సినిమా తీయడంపై పెట్టినట్టయితే కచ్చితంగా దీనికంటే చాలా మంచి సినిమాలొస్తాయి. వరుస పరాజయాలు వచ్చినపుడు కంటెంట్ ప్రధానమైన రాక్షసుడు సినిమా చేసి విజయవంతమయిన బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే మళ్లీ మాస్ ఉచ్చులో పడిపోయి ఇలాంటి పాయింట్లెస్ సినిమా చేయడం అతడి జడ్జిమెంట్‌ని, కెరీర్ ప్లానింగ్‌ని క్వశ్చన్ చేసేట్టు చేస్తుంది.
బాటమ్ లైన్: మెదడు చెదుర్స్!