స్కిల్ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో టీడీపీ గిలగిలలాడుతోంది.
“అయ్యా నేను తటస్థున్ని. అనవసరంగా నాతో శత్రుత్వం పెట్టుకోవద్దు. మీకే నష్టం. మీ శాపనార్థాలన్నీ నాకు వరాలే. పెద్దాచిన్నా లేకుండా నాపై నోరు పారేసుకుంటున్నారు. నన్ను ముసలి నక్క అని తిడుతున్నారు. మరి నాకంటే పెద్దవాడైన చంద్రబాబు జైల్లో ఉన్నారు. మరి ఆయన్ను ఏమనాలి” అని రెండు రోజుల క్రితం టీడీపీ నేతలకు చిలక్కు చెప్పినట్టు ఉండవల్లి హితవు చెప్పారు. అయినప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు.
ఉండవల్లిని గిల్లుతూనే ఉన్నారు. తాజాగా ఉండవల్లిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఏమున్నదో చదివావా? అని ఉండవల్లిని పట్టాభి ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి కొన్ని కాగితాలు వస్తే ఏ డాక్యుమెంట్లు జత చేశారో కూడా చూడకుండా పిటిషన్‌పై సంతకాలు చేస్తావా? అని పట్టాభి ప్రశ్నించారు. నిజాలన్నీ తెలిసినా తమపై బురద చల్లుతున్నట్టు పట్టాభి ఆరోపించారు.
తటస్థుడనే ముసుగును కూడా ఉండవల్లి నిస్సిగ్గుగా తీసేశారని విమర్శించారు. రూపాయి కూడా అవినీతి జరగని కేసులో సీబీఐ విచారణ కోరారని పట్టాభి తప్పు పట్టారు. ఉండవల్లి పిటిషన్లో పస లేకుంటే, ఏపీ హైకోర్టు స్వీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ విచారణ చేపట్టినా, అవినీతి జరగనప్పుడు, సీబీఐకి ఆదేశిస్తుందని టీడీపీ ఎందుకు భయపడుతోంది? ఉండవల్లి పిటిషన్‌పై వెన్నులో వణుకు పుట్టకపోతే, టీడీపీ చిల్లర నాయకులంతా ఆయనపై ఎదురు దాడికి దిగాల్సిన పనేముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలో రామోజీరావు కేసుల విషయంలోనూ ఉండవల్లితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన టీడీపీ నేతలు.. చివరికి ఎలా తోక ముడిచారో చూశాం. తాతకు దగ్గు నేర్పిన చందంగా, లాయర్ కూడా అయిన ఉండవల్లికి కేసుల విషయమై టీడీపీ నేతలు పాఠాలు చెబుతున్నారు. ఉండవల్లి మాత్రం కూల్‌గా, నవ్వుతూనే తాను చేయాలనుకున్న పనుల్ని చేసుకెళుతున్నారు.