గత వారం రోజులుగా ఎక్కడ వున్నారో తెలియదు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఆరోగ్యం కాస్త బాగాలేదని విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలు మాత్రం వినిపించాయి. అసలే తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. 32 సీట్లలో పోటీ చేస్తామని అన్నారు. ఏయే సీట్లు అన్నది ప్రకటించారు. మరి పవన్ ఈ టైమ్ లో మౌనంగా వున్నారేమిటా? అన్నది అనుమానం. మానిఫెస్టో ప్రకటించాలి. అభ్యర్ధులను నిర్ణయించాలి. ప్రచారం సాగించాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి అని ఎదురుచూపులు.
ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. బయటకు రావడం అంటే పార్టీ పనులకు హాజరు కావడం. నాదెండ్ల మనోహర్ తో కలిసి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు సాగించారు. ఈ మేరకు ఓ ఫొటో బయటకు వచ్చింది. మంగళగిరిలో ఈ సమావేశం జరిగింది. అంటే పవన్ అక్కడే వున్నారు లేదా ఇప్పుడు వెళ్లారు అనుకోవాలి. అయినా అది అప్రస్తుతం. కానీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలోకి వదిలిన ప్రెస్ నోట్ మాత్రం చిత్రంగా వుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, మలి విడత వారాహి యాత్ర, రైతులు, ఇతరత్రా సమస్యలు, తెలుగుదేశం పార్టీతో సమన్వయం ఈ అంశాలను చర్చించారట. కానీ ఇవి కాదు కదా ఇప్పుడు అర్జంట్ గా చర్చించాల్సినవి. తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం, పార్టీ నేతగా పవన్ పర్యటన ఖరారు చేయడం, తెలంగాణ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించడం ఇది కదా కీలకం?
మరి వాటి గురించి చర్చించినట్లు ప్రకటించలేదు. పోనీ ఆంధ్రలో జరిగిన సమావేశం కదా, అందువల్ల అక్కడి రాజకీయాల మీదే చర్చించి వుంటారు అనుకుందాం. మరి ఇంతకీ తెలంగాణ ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు ఎన్నికల దిశగా నడిపిస్తారు? అదే అస్సలు సమాధానం తెలియని ప్రశ్న.