ఇటీవలి కాలంలో తెలుగు హీరోలకు పట్టిన సరదా..’పాన్ ఇండియా’. సుధీర్ బాబు.. సందీప్ కిషన్ నుంచి రామ్ వరకు.. అందరి సినిమాలూ పాన్ ఇండియానే. ప్రతి సినిమా అనౌన్స్ మెంట్ కు అయిదు భాషల్లో లోగోలు, అనౌన్స్ మెంట్లు. మూడు వంతుల సినిమాలు అక్కడితో సరి. అన్ని భాషల్లో పాటలు రాయించడం, పాడించడం, విడుదల చేయడం వంటివి చేయడం లేదు. సినిమా విడుదల దగ్గరకు వచ్చేసరికి కాళ్లు పీకేస్తున్నాయి. పాన్ ఇండియా అన్నది మరిచిపోతున్నారు.
కొన్ని సినిమాలు పాన్ ఇండియా విడుదలకు నోచుకుంటున్నాయి కానీ ప్రచారం ఖర్చులు కూడా రావడం లేదు. ఓ రేంజ్ హీరోల పాన్ ఇండియా ప్రచారం అంటే చాలు ఛార్టర్ ఫ్లయిట్ లు, స్టార్ హోటళ్లు, అక్కడ మీడియా మీట్ అరేంజ్ మెంట్లు ఓ లెక్కలో వుంటున్నాయి. ఓ రేంజ్ హీరో అయితే కేవలం ముంబాయిలో ప్రచారం అంటే సరిపోవడం లేదు. కనీసం వారం రోజులు కేటాయించాలి. కొన్ని కోట్లు ఖర్చు చేయాలి.
ఒక లెక్క ప్రకారం కనీసం 15 కోట్లు ఖర్చు చేస్తే తెలుగు సినిమా నార్త్ బెల్ట్ లో విడుదలవుతోంది అని కనిపించేలా చేయవచ్చు అంట. అంత ఖర్చు చేసి విడుదల చేస్తే ఏ మాత్రం వస్తుంది అన్నది సమస్య. ఓ రేంజ్ వరకు ఖర్చు చేసినా నార్త్ ఏరియా అనే ఓషన్ లో సినిమా పెద్దగా కనిపించడం లేదు. అందువల్ల ఇకపై పాన్ ఇండియా అనేది కేవలం టాప్ రేంజ్ హీరోలకు మాత్రమే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.
ఇకపై సబ్జెక్ట్ సంగతి ఎలా వున్నా, మిడ్ రేంజ్ హీరోల వరకు పాన్ ఇండియా సినిమా అదే పదం ఇక పెద్దగా కనిపించకపోవచ్చు. గతంలో మాదిరిగా తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళ వరకు ఫిక్స్ కావచ్చు. హిందీ బెల్ట్ అన్నది చాలా పెద్ద ఏరియా. అక్కడ విడుదల అంటే అటు ప్రచారం అయినా ఇటు థియేటర్ల ఖర్చులు అయినా అంత వీజీ కాదు.