ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగించుకుని బడుల తలుపులు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే వేసవి తాపం ఇంకా తగ్గలేదు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభంపై పునరాలోచించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తాయి.
దీంతో వైసీపీ సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ ఒంటిపూట బడి నిర్వహించాలని కీలక ఆదేశాలు జారి చేసింది. దీంతో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకూ స్కూళ్లు నిర్వహించనున్నారు. ఈ లోపు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించనున్నాయి. వర్షాలు మొదలై వేడి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఒంటిపూట బడి నిర్వహించాలని నిర్ణయించడంతో సీఎం జగన్ మరో ఆదేశాన్ని ఇచ్చారు. ఉదయం 8 – 9 గంటల మధ్య రాగి జావను విద్యార్థులకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడం విశేషం. వారం పాటు మార్నింగ్ స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో హర్షం వ్యక్తమవుతోంది.