బీజేపీ నేతలు ఆంధ్రులు అయితే అమిత్ షాకు స్వాగతం పలకరని సీపీఐ అంటోంది. బీజేపీ వారిని ఆంధ్రులు అన్న ట్యాగ్ తో కట్టివేయాలని చూస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ ఏపీకి ఏమీ చేయలేదన్నది తెలిసి కూడా ఆయన ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా విశాఖ వస్తున్నారు అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కారని, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు సరిగ్గా ఇవ్వకుండా ముంచారని, ఉక్కు ముక్క లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేసి తీరుతామని కంకణం కట్టుకున్నారని, అన్ని విధాలుగా ఏపీని నాశనం చేస్తున్న బీజేపీకి ఏపీతో పనేంటి అని ఆయన మండిపడ్డారు.
బీజేపీకి మోడీ పాలనలో ఒరిగిందేమీలేదని అన్నారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు అంటూ ఏకరువు పెట్టడానికి అమిత్ షా రావడం కంటే విడ్డూరం మరేమీ ఉంటుందని అంటున్నారు. ఏపీకి ఏమీ చేయని అమిత్ షాకు స్వాగతం పలకడం అంటే ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెడుతున్నట్లే అని ఆయన అంటున్నారు. ఏపీలో ఎంత చేసినా బీజేపీకి ఉన్నది ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు అని, ఏపీ ప్రజలు బీజేపీని ఆదరించడం లేదు అన్న దానికి అదే ఉదాహరణ అంటున్నారు.
ఎమోషనల్ గా ఆంధ్రుల సెంటిమెంట్ ని అడ్డు పెట్టి ఏపీ బీజేపీ నేతలు అమిత్ షాకు స్వాగతం పలకవద్దు అంటున్న వామపక్షాల పిలుపుని బీజేపీ పట్టించుకుంటుందా. ఏపీకి కేంద్రం ఎంతో చేసిందని గొప్పగా ఏపీ బీజేపీ నేతలే చెప్పుకుంటున్న సందర్భంగా అమిత్ షా విశాఖ టూర్ కి అడ్డుకుంటామని వామపక్షాలు చేస్తున్న ప్రకటనలు రాజకీయ రచ్చనే రాజేస్తున్నాయి.