‘ముని’వాక్యం : అందం అశ్రువైన వేళ…

‘మడిసన్నాక కూసింత కలాపోసనుండాల’ అనే ఆధునిక జీవన వేదాన్ని రావుగోపాలరావు వాచికంలో, అభినయంతో ముళ్లపూడి వారు– బాపుగారు జమిలిగా మన మెదళ్లలో ముద్రపడిపోయేలా చేశారు. కలాపోసన సంగతేమో గానీ.. ప్రతి మనిషిలోనూ సౌందర్యాత్మక దృష్టి ఉంటుంది.…

‘మడిసన్నాక కూసింత కలాపోసనుండాల’ అనే ఆధునిక జీవన వేదాన్ని రావుగోపాలరావు వాచికంలో, అభినయంతో ముళ్లపూడి వారు– బాపుగారు జమిలిగా మన మెదళ్లలో ముద్రపడిపోయేలా చేశారు. కలాపోసన సంగతేమో గానీ.. ప్రతి మనిషిలోనూ సౌందర్యాత్మక దృష్టి ఉంటుంది. అందాన్ని చూసి ఆనందించడం, ఆస్వాదించడం, అందాన్ని చూసి అలా ఆనందించడంలో రిఫ్రెష్ కావడమూ చాలా సహజమైన సంగతి. 

అందం అనగానే.. అమ్మాయిల వైపు కొందరి ఆలోచన మళ్ల వచ్చు గానీ.. సౌందర్యాత్మక దృష్టికి లింగభేదం లేదు. అందమైన అమ్మాయిలను చూసి అబ్బాయిలు ఎలా ఒక ఆరాధన భావానికి లోనవుతారో.. అందమైన అబ్బాయిలను చూసి అమ్మాయిలు కూడా అలాగే అనుకుంటారు. లేకపోతే పాలమీగడ లాంటి హీరోలకు ఫస్ట్ డే ఫస్ట్ షో లో విజిల్స్ వేసే వేలాది మంది అమ్మాయిల ఫ్యాన్స్ దొరకరు.

అమ్మాయిలను ఇబ్బందికరంగా చూడడం కూడా లైంగికవేధింపుల కిందికే వస్తుందని చట్టం చెబుతుంది. కానీ అందమైన అమ్మాయి కనిపిస్తే కళ్లప్పగించి చూసేవాళ్లు, అందుకు కాస్త సభ్యత అడ్డు వచ్చినా కొంత మేర అయినా చూడకుండా ఉండలేని వాళ్లే మెజారిటీ ఉంటారు. ‘అమ్మాయి’ అనే మాటతోనే రాయాల్సి వస్తున్నది గానీ.. ఈ విషయాలన్నీ ‘అబ్బాయి’ అనే పదంతో కూడా రీప్లేస్ చేయదగినవి. వారి పరిస్థితి అయినా అంతే. 

వస్త్రధారణ నుంచి, ఆభరణాలు, మేకప్ ఇవన్నీ కూడా మనల్ని మనం ఉన్నదానికంటె మెరుగైన అందంతో బయటి ప్రపంచానికి చూపించుకోవడానికి ఉద్దేశించిన వ్యవహారంగానే సనాతనంగా మనకు అలవాటు అయింది. అందంగా కనిపించడం కోసమే మనం తయారవుతున్నాం.. ఎవరైనా ప్రత్యేకంగా మనల్ని గుర్తించడానికి, చూడడానికే ఆహార్యంలో వైవిధ్యాన్ని, విలక్షణతను ఆశ్రయిస్తుంటాం. అలాంటప్పుడు.. ప్రత్యేకంగా చూడడాన్నే లైంగిక వేధింపు కిందికి ఎలా పరిగణిస్తాం? అనేది వేరే చర్చ.

కానీ, అందం ముసుగులో దేహాన్ని అనేక రకాల యాతనలకు గురిచేస్తుంటాం- అనేది మనం బోధపరచుకోలేని వాస్తవం. 

‘దైహిక సౌందర్య పిపాసయే, మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా! చెవులకి, ముక్కుకి రంధ్రాలు పొడిచి లోలాకులు ముక్కెరలు వేలాడదీస్తాం. మెడనూ నడుమునూ కాళ్లనూ రకరకాల గొలుసులతో బంధిస్తాం!’’ అంటుంది విమల తన ‘సౌందర్యాత్మక హింస’ అనే కవితలో! 

అందానికి మనం అనుకునే నిర్వచనాలూ, దేహానికి మనం ఆపాదించుకునే ప్రాధాన్యమూ, ఆహార్యానికి యిచ్చే విలువా అన్నీ మారుతాయి.. ఆ కవిత చదివితే. కానీ మన జీవితాలను మార్కెట్ శక్తులు శాసించే, మన ఇష్టాయిష్టాలని వ్యాపారవేత్తలు నిర్ణయించే  ఈరోజుల్లో- జీవితాన్ని విమల చెప్పినట్టు ‘‘నగ్నంగా, తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు ఏ అలంకారాలు, ఏ సౌందర్య కొలబద్ధలు లే’’కుండా గడపడం అనేది అసాధ్యం. సౌందర్యాత్మక పరుగులో ఇమిడిపోవడానికి, మనల్ని మనం పతనం చేసేసుకోవడానికి మన మాటల అమ్ముల పొదిలో శతసహస్ర అస్త్రాలుంటాయి, ఆత్మవంచనాత్మకమైనవి.

సౌందర్యాన్ని సౌందర్యంగా చూడడం అనే సభ్యత గీత చెరిగినట్టుగా అనిపించే ప్రస్తావనలు మనకు కొల్లలుగా దొరుకుతాయి, పురాణాల్లో గ్రంథాల్లో. ఆదిశంకరాచార్యుడు రాసిన సౌందర్య లహరి ఇందుకు ఒక ఉదాహరణ.

సమం దేవి స్కన్దద్విపవదనపీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్.. ఆదిశంకరాచార్యుడు పార్వతీదేవిని స్తుతిస్తూ రాసిన సౌందర్యలహరిలోని శ్లోకపాదాలు ఇవి. 

అమ్మవారి స్తనాలను, స్తనాగ్రాలను వర్ణిస్తూ రాసిన వాక్యాలు. సౌందర్యలహరి సగభాగానికి పైగా అమ్మవారి అందాన్ని వర్ణించడంలోనే సాగిపోతుంది. అయితే అసభ్యత అనిపించదు. ఈ వాక్యాల అర్థం ఇలా ఉంటుంది. ‘‘కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరూ ఒకేసారి పాలు తాగుతున్న నీ రెండు స్తనాలు మా కష్టములను తొలగించి మేలు చేయుగాక’’ అని! దేవీ అమ్మవారి స్తనాలగురించే సుదీర్ఘమైన వర్ణన ఇంకా బోలెడంత సాగిపోతుంది. 

ఇవాళ్టి రోజుల్లో మనం పరిగణించే ప్రమాణాల ప్రకారం.. చాలా చోట్ల హద్దు దాటినట్టు కూడా అనిపిస్తుంది. కానీ.. ఎంతగా అందాన్ని వర్ణిస్తున్నా పార్వతీదేవిని తల్లిగా భావించే సంబోధనే ప్రతిచోటా మనకు కనిపిస్తుంది. చివరకు ఆమె చరణకమలాలకు నమస్కరించడం వరకు తీసుకువెళతాడు ఆదిశంకరాచార్యుడు.. ఈ ‘సౌందర్య లహరి’లో. ఈ ప్రస్తావన అంతా ఎందుకు చెబుతున్నానంటే.. అందాన్ని ఎంత హద్దుదాటిచూసినా సరే, హద్దుదాటి ఆరాధించినా సరే.. బుద్ధి స్వచ్ఛంగా ఉన్నంత వరకు చేతలు అతిక్రమించనంత వరకు ఇబ్బంది లేదు.

అందాన్ని అందంగా చూడడంలో హద్దులు దాటడంలోనే సామాజిక పెడపోకడలు తలెత్తుతున్నాయి. కన్న కూతురిని సెక్స్ ఆబ్జెక్ట్ గా చూస్తూ, కూతురిపై అత్యాచారాలు చేసే తండ్రుల ఉదాహరణలు మనకు కోకొల్లలుగా దొరుకుతాయి. ఇది ఒక సైకలాజికల్ దురవస్థ, దుర్మార్గం. కన్నబిడ్డలతో సెక్స్ చేసే తండ్రులను సైకాలజీలో ‘పెడొఫైల్’ అని పేర్కొంటారు. ఇలాంటి నీచులకు- ఇవాళ్టి వార్తల్లో వ్యక్తిగా చెలామణీ అవుతున్న విజయనగరం ఆనందకుమారికి తేడా ఏముంది. ఇలాంటి తల్లులకోసం సైకాలజీలో ప్రత్యేకంగా పదాలను తయారుచేసినట్టు లేదు గానీ.. కన్న కూతురిని సెక్స్ ఆబ్జెక్ట్ గా చూడడంలో పెడొఫైల్ తండ్రులతో సమానమే ఈమె కూడా!

విజయనగరంలోని ఆనందకుమారి జీవనగమనం మొత్తం అందంతో ముడిపడినదే. ఆమె ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నది. ఒక కూతురు పుట్టాక భర్త చనిపోయాడు. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అతను ఇంటికి వస్తూ పోతూ ఆమె 15 ఏళ్ల కూతురిని చూసి సినిమా హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని తల్లిని రెచ్చగొట్టాడు.  కాకపోతే అమ్మాయి ఇంకా లేతగా ఉన్నదని పెదవి విరిచాడు. దుర్మార్గానికి ప్రేరేపించాడు.

నలభయ్యేళ్ల వయసులో సినిమా పాటలకు డ్యాన్సులు చేసే వీడియోలతో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ఆ తల్లికి, తాను హీరోయిన్ కాగలననే ఆశలు ఉండేవేమో తెలియదు, అలాంటి కలలను తన కూతురితో తీర్చుకోవాలని అనుకున్నదేమో తెలియదు. అదేమీ తప్పు కూడా కాదు. కానీ, పదిహేనేళ్ల అమ్మాయిని త్వరగా హీరోయిన్ చేసేయాలని, ఆమె శరీర భాగాలు త్వరగా పెద్దవిగా చేసేయాలనే ఆత్రుతలో హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తూ కూతురి ఆరోగ్యాన్ని  బలితీసుకుని, ఆమె ప్రాణాన్ని పణంగా పెట్టడమే ఇక్కడ శోచనీయమైన విషయం.

మన సమాజంలో నూటికి తొంభై మంది తల్లిదండ్రులు తాము తీర్చుకోలేకపోయిన, తమకు చేతకాని జీవిత స్వప్నాలను తమ పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చైతన్య, నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకునే వందలాది పిల్లల తల్లిదండ్రుల్లో ఇలాంటి వారిని మనం గమనించవచ్చు. ఈ ఆనంద కుమారి కూడా అలాంటిదే. తన కలలను తన కూతురితో తీర్చుకోవాలని, కూతురును హీరోయిన్ చేయాలని అనుకుని ఉండవచ్చు. అయితే అందుకోసం కూతురిని యాక్టింగ్ స్కూళ్లలో చేర్చినా, సినిమా పరిశ్రమలో రాణించేలా నాట్యం, డ్యాన్స్ నేర్చుకునేలా ప్రోత్సహించి ఉన్నా ఇంతగా మధనపడే అవసరం లేదు. 

కానీ, ఆ తల్లి, సినిమా హీరోయిన్ అంటే కేవలం దేహం మాత్రమే అని అనుకున్నది. కూతురి దేహాన్ని మాత్రమే హీరోయిన్ కావడానికి అర్హతగా ఆమె భావించింది. దేహమే సంపద, దేహమే అర్హత, దేహమే ఎర! అందుకే కూతురి శరీర భాగాలు పెరగడానికి హార్మోన్ ఇంజక్షన్లను ఆశ్రయించింది.

ఈ దుర్మార్గపు పోకడలను ఎలా అర్థం చేసుకోవాలి? దేహాన్నే ‘అందం’గా చూపించే సినిమా పరిశ్రమ ఇలాంటి తల్లులను చెడగొడుతోందని అనుకోవాలా? తమకున్న వనరు దేహాత్మకమైన అందం గనుక.. దానినే జీవితపు పరుగులో సంపదల అందలాలను అందుకోడానికి నిచ్చెన మెట్లుగా మార్చుకోవాలనే తప్పుడు తపనగా భావించాలా?

‘సౌందర్యాత్మక హింస’లో విమల వాక్యాలే పరిష్కారంగా మనకు కనిపిస్తాయి. ‘‘అందం సరుకైన చోట అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం’’

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]