ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం అరశాతం. కానీ నాయకులు మాత్రం బోలెడు మంది ఉన్నారు. ఏపీలో కనీస బలం లేకపోయినా, కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీకి జై కొడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు వుండాలని బీజేపీలోని బాబు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
ఇదిలా వుండగా బీజేపీలో ఇద్దరి నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి మధ్య విశాఖ లోక్సభ సీటు విషయమై వార్ నడుస్తోందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. గతంలో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన పురందేశ్వరి, మన్మోహన్సింగ్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్కు భవిష్యత్ లేదని తెలుసుకుని, బీజేపీలో చేరారు.
విశాఖ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆ తర్వాత రాజంపేట నుంచి పోటీ చేసినా ప్రయోజనం లేకపోయింది. విశాఖ లోక్సభ స్థానంపై ఇష్టాన్ని పెంచుకున్న పురందేశ్వరి, మరోసారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పారు. మరోవైపు అదే సీటుపై బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కన్నేశారు. ఈ మేరకు ఆయన విశాఖలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా కాపుల ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ విశాఖలో పర్యటిస్తూ, స్థానిక భూసమస్యలపై మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్టుగానే, వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించడం వెనుక కాపుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ వుందని సమాచారం. కానీ వంగవీటి పేరును ఒక జిల్లాకు పెట్టాలనే డిమాండ్ జీవీఎల్ వ్యక్తిగత ఎజెండా అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
విశాఖ సీటుపై ఎవరికి వారు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. జీవీఎల్, పురందేశ్వరిలలో ఎవరి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందో చూడాలి.