తెలంగాణలోని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీష్ ఇవాళ ఉదయం గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈయన ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గుండెపోటుకు గురైన జగదీష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1న జగదీష్ గుండెపోటుకు గురైనట్టు సమాచారం. ఆ రోజు అపస్మారక స్థితిలో ఉన్న జగదీష్‌కు భార్య రమాదేవి వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మరోసారి గుండెపోటుకు గురైన జగదీష్‌ను కాపాడకోలేక పోయినట్టు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో జగదీష్ క్రియాశీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్లో యాక్టీవ్‌గా వ్యవహరించేవారు. అందుకే ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. మృతికి సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో జగదీష్ తన వెంట జగదీష్ నడిచారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జగదీష్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా వుంటామని కేసీఆర్ తెలిపారు.