కేసీఆర్ అమాయ‌కుడై వుంటే…ఎన్టీఆర్ గ‌తేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై విషం క‌క్క‌డం తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావుకు నిత్య‌కృత్య‌మైంది. త‌న మేన‌మామ‌, సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని తెలిసి కూడా, హ‌రీష్‌రావు నోరు పారేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్‌కు మిత్రుడు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై విషం క‌క్క‌డం తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావుకు నిత్య‌కృత్య‌మైంది. త‌న మేన‌మామ‌, సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని తెలిసి కూడా, హ‌రీష్‌రావు నోరు పారేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్‌కు మిత్రుడు కావ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు.

ఏపీ నేత‌ల‌కు మాట‌లెక్కువ‌, చేత‌లు త‌క్కువ‌ని హ‌రీష్‌రావు విమ‌ర్శించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్‌ను పేర్ని నాని ఇచ్చారు. కేసీఆర్ అమాయ‌కుడై వుంటే, ఎన్టీఆర్ గ‌తే ప‌ట్టేద‌ని నాని చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ హ‌రీష్‌రావుపై చెల‌రేగిపోయారు.

తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావుకు మేన‌మామ కేసీఆర్‌పై విప‌రీత‌మైన దుగ్ద‌, బాధ అని అన్నారు. కేసీఆర్‌పై హ‌రీష్‌కు విప‌రీత‌మైన కోపం అని ఆయ‌న చెప్పుకొచ్చారు. అలాగే బామ్మ‌ర్ది (కేటీఆర్‌)పై ఈర్ష్య అన్నారు. అమాంతం మామను తోసేసి సీఎం సీట్లో కూచోవాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యం హ‌రీష్‌లో ఉన్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.  మామ‌ను తిట్ట‌లేడ‌ని, చీక‌ట్లో బెదిరిస్తుంటాడ‌ని పేర్ని ఆరోపించారు. హ‌రీష్‌ బ్లాక్ మెయిల్‌కు వాత పెట్టేందుకే క‌దా ఆయ‌న్ని కేసీఆర్‌ ప‌క్క‌న పెట్టింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. 2018లో కేసీఆర్ మ‌ళ్లీ గెలిచాక హ‌రిష్‌రావు ఎక్క‌డున్నాడు? ఎందుకొచ్చింది ప‌నిష్మెంట్‌? అని నాని ప్ర‌శ్నించారు.

హ‌రీష్‌రావు భాష‌లో చేత‌లంటే కుట్ర‌లు, కుతంత్రాల‌ని పేర్ని నాని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబును అనుస‌రించాల‌ని అనుకుంటున్నాడ‌ని దెప్పి పొడిచారు. ఎన్టీఆర్ అమాయ‌కుడు కాబ‌ట్టి చంద్ర‌బాబు చేతిలో అయిపోయాడ‌న్నారు. కానీ కేసీఆర్ ముదురు కాబ‌ట్టి, చంద్ర‌బాబును చూసి బ‌య‌ల్దేరిన హ‌రీష్‌రావును చాచి ఒక్క‌టి కొట్టాడ‌ని పేర్ని అన్నారు. ఈ సారి జ‌గ‌న్‌ను మ‌రోసారి మాట్లాడితే, హ‌రీష్‌రావు కోరిక ప్ర‌కారం ఆయ‌న మామ‌ను బాగా తిడ్తామ‌ని వ్యంగ్యంగా అన్నారు.

హ‌రీష్‌రావుకు ఇక్క‌డి విష‌యాల‌తో సంబంధం లేక‌పోయినా, ప‌దేప‌దే జోక్యం చేసుకుంటున్నాడంటే, కేసీఆర్‌ను తిట్టించాల‌నేది ఆయ‌న ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. హ‌రీష్‌రావు స‌ర్టిఫికెట్లు ఇక్క‌డ ఎవ‌రికీ అవ‌స‌రం లేద‌న్నారు. ఎవ‌రైనా ఏడ్చే వాళ్ల‌కు ఆయ‌న స‌ర్టిఫికెట్లు ఇవ్వాల‌ని సూచించారు.

గ‌తంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు హ‌రీష్‌రావు క‌ల‌వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అప్ప‌ట్లో కాంగ్రెస్‌లో హ‌రీష్‌రావు చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. వైఎస్సార్‌తో హ‌రీష్ మంచి సంబంధాలు కొన‌సాగించేవారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌కు ఏదో ఒక రోజు హ‌రీష్‌రావు వెన్నుపోటు పొడుస్తాడ‌నే ప్ర‌చారం తెలంగాణ‌లో బ‌లంగా వుంది.