ప‌వ‌న్‌పై ఎంత ఘాటు తిట్టో!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌ల దాడి పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప‌వ‌న్‌ను ఏకిపారేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వాల‌ని అడ‌గ‌డమే కాంగ్రెస్ దృష్టిలో…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌ల దాడి పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప‌వ‌న్‌ను ఏకిపారేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వాల‌ని అడ‌గ‌డమే కాంగ్రెస్ దృష్టిలో ప‌వ‌న్ చేసిన నేర‌మైంది. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల‌ని, జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని ఇటీవ‌ల జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆర్భాటంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ రాజ‌కీయ పంథాపై ఇప్ప‌టికే కాంగ్రెస్ సీనియ‌ర్ నేతలు హ‌ర్ష‌కుమార్‌, శైల‌జానాథ్ త‌దిత‌రులు విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్రెడ్డి తుల‌సిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ బ్రోక‌ర్ అని ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కంటూ సొంత పార్టీ పెట్టుకుని, మ‌రో పార్టీని రూట్ మ్యాప్ ఎలా అడుగుతార‌ని ఆయ‌న నిల‌దీశారు.

బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎదురు చూడ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన‌ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడమేమిటని ఆయ‌న నిల‌దీశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని తులసిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు. 

టీడీపీ మిన‌హా మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మిగిలిన ప్ర‌తిప‌క్షాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాయి. 

విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌ని, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని, అలాగే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి త‌గిన‌న్ని నిధులు ఇవ్వ‌ని, విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రిస్తున్న కేంద్రంలోని బీజేపీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటావ‌నేది ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌. అందుకే ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు, నిల‌దీత‌లు.