గన్నవరంలో వల్లభనేని వంశీ చేరికతో వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. అప్పట్లో జగన్ ఆ రెండు వర్గాలను చేతిలో చేయి వేసి కలిపినా ఫలితం లేదు. తాజాగా వంశీ వ్యతిరేక వైసీపీ వర్గం.. విజయసాయిరెడ్డికి నేరుగా ఓ లేఖ రాసింది. వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని, ఇచ్చినా ఆయన గెలవడని హెచ్చరించింది.
వంశీ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30వేల భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ కూడా ఇచ్చింది. అర్జెంట్ గా గన్నవరంలో పార్టీకి కొత్త ఇన్ చార్జిని పెట్టాలని కోరింది. ఇంతకీ గన్నవరంలో వంశీ వైరి వర్గం ఏం చేయాలనుకుంటోంది..?
వంశీపై విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేస్తూ వైసీపీలో మరో వర్గం రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందర్నీ కలుపుకొనిపోతానంటూ పార్టీలోకి వచ్చిన వంశీ వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారంటూ దుట్టా రామచంద్రరావు వర్గం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
లేఖలో ఆయన పేరు లేకపోయినా, ఆ పని దుట్టానే చేయించారని వంశీ వర్గం గుర్రుగా ఉంది. విజయసాయికి లేఖ అందినా అందకపోయినా, దాన్ని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మార్చారు. గన్నవరంలో ఏదో సంచలనం జరగబోతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వంశీ పోటీ చేయగా, వైసీపీ నుంచి దుట్టా రామచంద్రరావు గన్నవరంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరపున బరిలో నిలిచిన వంశీ, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుని ఓడించారు. ఆ తర్వాత వంశీ, జగన్ కి జై కొట్టడంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు ఇబ్బంది మొదలైంది. జగన్ సర్దిచెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఇలా లేఖ రూపంలో మరోసారి గొడవ బజారుకెక్కింది.
2024 ఎన్నికల్లో గన్నవరం సీటు వంశీకేనంటూ జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారని, అయితే వంశీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనేది ప్రత్యర్థి వర్గం వాదన. జగన్ జిందాబాద్, వంశీ డౌన్ డౌన్ అనే స్లోగన్లతో వీరు రెచ్చిపోతున్నారు. ఈ ఇంటిపోరుని వంశీ తట్టుకోగలరా.. లేక అధిష్టానంతో.. వైరి వర్గానికి చెక్ పెట్టించగలరా.. వేచి చూడాలి.