మీకు దమ్ముందా… అనిల్‌ స‌వాల్‌!

2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ వేడి మొద‌లైంది. టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగే ప‌రిస్థితి లేదు. 2019లో ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నిక‌ల్లో…

2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ వేడి మొద‌లైంది. టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగే ప‌రిస్థితి లేదు. 2019లో ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నిక‌ల్లో నిలిచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. 

జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట్ సీట్ల‌ను ద‌క్కించుకుని త‌న‌కెదురే లేద‌ని చాటుకుంది. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబుకు బెంగ ప‌ట్టుకుంది. ఈ ద‌ఫా ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. 

ఏ మాత్రం అవ‌కాశం జారి విడుచుకున్నా ఇక టీడీపీ చ‌రిత్ర ముగిసిన‌ట్టే అని చంద్ర‌బాబు ఆందోళ‌న‌తో ఉన్నారు. దీంతో జన‌సేన‌తో పొత్తుకు ఆయ‌న వెంప‌ర్లాడుతున్నారు. మ‌రోవైపు జ‌న‌సేన‌ది అదే ప‌రిస్థితి. ఒంట‌రిగా పోటీ చేస్తే క‌నీసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా గెల‌వ‌లేని దుస్థితి. అందుకే చంద్ర‌బాబు పొత్తు కోసం ప‌వ‌న్ సైతం సిద్ధంగా ఉన్నారు.

ఇవాళ శాస‌న మండ‌లిలో మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ త‌న‌దైన స్టైల్‌లో టీడీపీకి స‌వాల్ విసిరారు. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గ‌ల‌దా? అని ప్ర‌శ్నించారు. ధైర్యం వుంటే ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌రా అని స‌వాల్ విసిరారు. 2024లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని.. ఆ దమ్ము టీడీపీకి ఉందా అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. 

టీడీపీని ఇలా ఎంత‌గా రెచ్చ‌గొట్టినా స్పందించే ప‌రిస్థితి ఉండ‌దు. ఎందుకంటే పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయి ఒంట‌రిగా బ‌రిలో దిగితే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని చంద్ర‌బాబుతో పాటు మిగిలిన టీడీపీ నేత‌ల భ‌యం.