సినిమా ఫ్లాప్ అని ప్రభాస్ కు చెప్పింది నేనే – దిల్ రాజు

సినిమా ఫ్లాప్ అనే విషయం హీరోకు నేరుగా చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. మరీ ముఖ్యంగా మొదటి రోజు మొదటి ఆటకే అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ఓ ఘటనను గుర్తుచేసుకున్నాడు…

సినిమా ఫ్లాప్ అనే విషయం హీరోకు నేరుగా చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. మరీ ముఖ్యంగా మొదటి రోజు మొదటి ఆటకే అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ఓ ఘటనను గుర్తుచేసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్న టైమ్ లో మున్నా సినిమాతో దిల్ రాజు హవాకు స్పీడ్ బ్రేకర్ పడింది.

వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, తను నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన మున్నా సినిమా రిజల్ట్ తేడా కొట్టిందనే విషయం దిల్ రాజుకు మొదటి రోజు, మొదటి ఆటకే తెలిసిపోయిందట. ఆ విషయాన్ని నేరుగా వెళ్లి ప్రభాస్ కే చెప్పేశానంటూ అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నాడు దిల్ రాజు.

“మున్నా స్క్రిప్ట్ దగ్గరే నాకు ఇబ్బంది అయింది. కానీ వంశీ పైడిపల్లి ఒప్పుకోలేదు. చాలా వాదించాడు. రైటర్ కొరటాల శివ కూడా బాగుందన్నాడు. అక్కడ నేను తగ్గాను. దర్శకుడ్ని నమ్మాను. రిలీజ్ రోజు మొదటి ఆట చూశాను. డైరక్ట్ గా ప్రభాస్ దగ్గరకు వెళ్లాను. ఆ టైమ్ లో ప్రభాస్, వాళ్ల ఫ్రెండ్స్ హిట్ కొట్టేశాం అనే ఆనందంలో ఉన్నారు. నేను డైరక్ట్ గా ప్రభాస్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పాను. హిట్ సినిమా ఇవ్వలేకపోయానని అన్నాను. ప్రభాస్ ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు, ప్రభాస్ కూడా బాగుందంటూ వాదించాడు. నేను ఒప్పుకోలేదు. మున్నా సినిమా యావరేజ్ సినిమా అని చెప్పాను, మెంటల్లీ ప్రిపేర్ అవ్వమని చెప్పేశాను.”

అప్పటికే వరుసగా 4 హిట్లు కొట్టాడు దిల్ రాజు. కాబట్టి ప్రేక్షకులు, ఆ హిట్స్ తో మున్నాను సరిపోల్చుకొని నిరాశచెందారని చెప్పుకొచ్చాడు. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ సినిమా 9 సెంటర్లలో వంద రోజులు ఆడిందని గుర్తుచేశాడు. 

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని, వీలైనంత త్వరగానే అతడితో తన సినిమా ఉంటుందని దిల్ రాజు ప్రకటించాడు.