ఏపీలో బీజేపీ-జనసేన అధికారికంగా మిత్రపక్షాలు. క్షేత్రస్థాయిలో కలిసి పని చేయకపోయినా, ఇంకా అధికారికంగా విడిపోలేదు. జనసేన, బీజేపీ నేతలు తాము మిత్రపక్షాలుగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్ అభియాన్’లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈయన ప్రసంగంలో ఎక్కడా జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రస్తావనే లేదు. కేవలం బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని మాత్రమే చెప్పారు. జనసేనను అసలు ఆ పార్టీ పరిగణలోకి కూడా తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలంతా ప్రసంగించారు. ఒకవైపు జగన్ సర్కార్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ, మరోవైపు విమర్శలు చేయడాన్ని ఏపీ ప్రజానీకం పెద్ద జోక్‌గా భావిస్తోంది.
ప్రతిపక్షాలపై బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదు. జేపీ నడ్డా మాట్లాడుతూ ఏపీలో అన్యాయ, అరాచక పాలన సాగుతోందని, ఇలాంటి సర్కార్‌ను తానెక్కడా చూడలేదని విమర్శించడం సభలో హైలెట్ కామెడీగా చెప్పుకోవచ్చు. ఏపీలో అధికారంలోకి రావాలనే తపన ఆయన మాటల్లో ఎక్కడా కనిపించలేదు. ఎవరినో సంతృప్తిపరచడానికి అన్నట్టు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామనే భరోసాను ఆయన కల్పించలేకపోయారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ బీజేపీ-జనసేన కూటమికి అవకాశమివ్వాలని కోరారు. ఈయన ఒక్కరే జనసేన మాట ప్రస్తావించారు. మిగిలిన నేతలెవరూ జనసేన ఊసే ఎత్తకపోవడం ద్వారా, ఆ పార్టీకి జాతీయ పార్టీ ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.