ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కే రగిలిపోతున్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై మీడియాధిపతిగా ఆర్కే ఎందుకంత కోపాన్ని పెంచుకున్నారో అర్థం కాదు. చంద్రబాబు అంటే ఆరాధిస్తారని అందరికీ తెలుసు. టీడీపీపై సోము వీర్రాజు ఒంటికాలిపై లేస్తారు. టీడీపీతో పొత్తును వీర్రాజు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, వైసీపీలను సోము వీర్రాజు సమాన దృష్టితో చూస్తారు.
బహుశా ఈ లక్షణాలే వీర్రాజు అంటే ఆర్కేకి కోపం తెప్పించి వుంటాయి. ఏపీలో ఎవరైనా సీఎం వైఎస్ జగన్‌ను వ్యతిరేకించాలని ఆర్కే కోరుకుంటున్నారు. అయితే అంతా తమ మాదిరే ఆలోచించాలని, నడుచుకోవాలనే కోరుకోవడంతోనే సమస్య ఉత్పన్నమైంది. తమ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించే రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆర్కే పెట్టుకున్నారు. అసలు వాళ్ల ఉనికే లేకుండా చేయాలని ఆర్కే తపిస్తుంటారు.
తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పురందేశ్వరి, సీఎం రమేశ్ నాయుడు, సత్యకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితర నేతలంతా హాజరయ్యారు. ఈ సభకు సంబంధించి కవరేజీలో వీర్రాజును ఆర్కే పత్రిక విస్మరించడం గమనార్హం.
ఇంత అవినీతా? శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్‌గా బీజేపీ సభను క్యారీ చేసింది. ఇంత వరకూ బాగానే ఉంది. ఈ వార్తా కథనానికి ఫొటో మొదలుకుని, వార్త రాయడం వరకూ సోము వీర్రాజుపై ఆర్కే వ్యతిరేకతను ప్రతిబింబించింది. ఈ ఫొటోలో వీర్రాజు కనిపించకుండా ఆంధ్రజ్యోతి జాగ్రత్తలు తీసుకుంది. అలాగే వార్తలో ఎక్కడా వీర్రాజు మాట్లాడినట్టు లేదు. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో చూస్తే …ఫొటోలో నడ్డా పక్కన వీర్రాజును చూడొచ్చు.
ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటే నడ్డాతో పాటు వీర్రాజు కూడా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీర్రాజు ఉనికిని గుర్తించడానికి సదరు మీడియాధిపతి నిరాకరిస్తున్నారనే విషయం, బహిరంగ సభ ఫొటోను చూస్తే, వార్తను చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ పార్టీ ఏపీ అధ్యక్షుడిపై ఈ రేంజ్లో అక్కసును మీడియాధిపతి పెంచుకోవడం అవసరమా? అనే చర్చకు తెరలేచింది.