కల్తీ మద్యంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని, జే బ్రాండ్స్‌ను నిషేధించాలని వైసీపీ సర్కార్‌ను టీడీపీ ఇరుకున పెడుతున్న సమయంలో, అధికార పార్టీకి ఊహించని ఆయుధం దొరికింది. అది కూడా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పెగాసస్‌పై చేసిన వ్యాఖ్యలే టీడీపీ మెడకు చుట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల ముందు మమతాబెనర్జీతో కలిసి చంద్రబాబు దేశమంతా తిరుగుతూ మోదీ సర్కార్‌ను పడగొట్టాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.
గతంలో మమతాబెనర్జీతో బాబుకున్న స్నేహ సంబంధాల రీత్యా, ఆమె ఆరోపణలకు విలువ ఏర్పడింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు కొనుగోలు చేయాలని తమ రాష్ట్ర పోలీసులకు ఆ సంస్థ ప్రతినిధులు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయితే ఆ ప్రతిపాదనను తాము స్వీకరించలేదన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేసినట్టు ఆమె ఆరోపణలు చేయడం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్‌పై చర్చ జరగాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిరోజూ కల్తీ సారా వ్యవహారంపై అసెంబ్లీలో గొడవ చేస్తున్న టీడీపీకి పెగాసస్ వ్యవహారం తలనొప్పిగా మారింది. బుగ్గన మాట్లాడుతూ ఫోన్ ట్యాఫింగ్కు చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్టు బాధ్యతగల ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పడాన్ని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పెగాసస్ తీవ్ర దుమారం రేపడంతో బాధ్యతగల వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు.
దీన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకుని రిటైర్డ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ గారిని విచారణ నిమిత్తం నియమించిందని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దేశంలో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెగాసస్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారని ఆమె చెప్పారన్నారు. పెగాసస్ ద్వారా అనధికారికంగా ప్రతి వ్యక్తి ఫోన్‌ను మానిటర్ చేశారన్నారు. పెగాసస్ అనే కీలకమైన విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో అనధికారికంగా చట్టవిరుద్ధంగా వ్యక్తిగతంగా వారి ఫోన్లను ట్యాప్ చేయవచ్చన్నారు. పెగాసస్ ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని ఆయన అరోపించారు. చివరికి భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఈ పెగాసస్ ద్వారా మానిటర్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ ముఖ్యమైన సమస్యపై తప్పకుండా సభలో చర్చ జరగాల్సిందే అన్నారు. సుప్రీంకోర్టు విచారిస్తున్న కమిటీకి అసెంబ్లీలో చర్చించిన అంశాలను అందజేయాలన్నారు. టీడీపీపై ఎదురు దాడికి అధికార పార్టీకి దక్కిన అనూహ్య అస్త్రమని భావించొచ్చు.