రాయలసీమ అభివృద్ధి కోసం తాము కంకణం కట్టుకుని ఉన్నట్టుగా కమలదళం కడపజిల్లాలో ఒక పెద్ద సమావేశం నిర్వహించింది. అధికార వైసీపీ ద్రోహం చేస్తున్నదని కూడా అన్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ పాడిన పాటకు కంటిన్యుయేషన్ లాగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని అంటూ పొత్తుల సంకేతాలు కూడా ఇచ్చారు.
సభ ముగిసిన తర్వాత.. ఎంచక్కా కిషన్ రెడ్డి లాంటివాళ్లు తిరుమల దర్శనంచేసుకుని వెళ్లిపోయారు. సోము వీర్రాజు లాంటి వాళ్లు మాత్రం.. వైసీపీ సర్కారు రాయలసీమకు చేసిన ద్రోహం గురించి ఇంకా వదరుతున్నారు. రాయలసీమకు నిజానికి చాలాచాలా ద్రోహం చేసిన బీజేపీ ఇలా ఎదుటివారి మీద నిందలు వేస్తూ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
సీమలో సభ పెట్టి, సీమ మీద అవ్యాజమైన ప్రేమానురాగాలను ఒలకబోశాం గనుక.. కొన్ని రోజుల పాటూ సీమ పాట పాడుతూ ఉంటే ప్రజలు తమను గుర్తిస్తారని కమలదళం ఒక వ్యూహం ప్రకారం వెళుతున్నదేమో తెలియదు. అదే సమయంలో.. ఇటీవలి బద్వేలు ఉప ఎన్నికలో తమ పార్టీకి డిపాజిట్ వచ్చింది గనుక.. రాష్ట్రంలో మరెక్కడా ఆ మాత్రం సీన్ లేదు గనుక.. కడపజిల్లాలో మీటింగ్ పెడితే.. సీమలో పార్టీకి ఆదరణ పెరుగుతుందని కమల నాయకులు అత్యాశ చెందుతున్నారో తెలియదు గానీ.. మొత్తానికి ఇంకా సీమ పాట పాడుతున్నారు.
అయితే అసలు బీజేపీ నాయకులకు సీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా అనే ప్రశ్న ప్రజలనుంచి వినిపిస్తోంది. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేసిన వంచన సరే.. కనీసం బుందేల్ ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమకు దక్కవలసిన ప్రత్యేకప్యాకేజీ కూడా రాకుండా మోసం చేసింది బీజేపీనే కదా అనే ప్రశ్న ప్రజలనుంచి వినిపిస్తోంది.
కడపజిల్లాలో స్టీలు ప్లాంటు రాకపోవడంలో గానీ, శ్రీకాళహస్తిలో మన్మోహన్ సింగ్ శంకు స్థాపన చేసిన విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్ అమల్లోకి రాకపోయినా ఆ పాపం బీజేపీ ప్రభుత్వానిదే కదా అని వారు నిలదీస్తున్నారు. బీజేపీ నాయకులు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబతారు.
రాయలసీమకు తాము చేసిన ద్రోహాలు అన్నీ ప్రజలు మరచిపోయి ఉంటారనుకుని, ఏదో నంగనాచి కబుర్లు చెప్పి.. వారు బుట్టలో పడతారని బీజెపీ అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. అది రాయలసీమలోనైనా కావొచ్చు, యావత్ ఆంధ్రప్రదేశ్ లోనైనా కావొచ్చు.. తమకు నాలుగు ఓట్లు రాలాలనే కోరిక బీజేపీ నాయకులకు ఉంటే గనుక.. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి తమ కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలగాలి.
సిస్టమ్ లో భాగంగా.. ఇక్కడ వసూలు చేసిన పన్నుల నుంచి ఈ రాష్ట్రానికి కొంత విదిలించి.. కేంద్రం ఇన్నివేల కోట్లు, అన్ని వేల కోట్లు ఇచ్చిందని కాకమ్మ కబుర్లు చెబితే వారు ప్రజాదరణ పొందలేరనే సంగతి తెలుసుకోవాలి.