ర‌ఘురామా…త‌మ‌రి చేరిక ఎప్పుడు సార్‌!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఢిల్లీలో కూచుని నిత్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై చ‌క్క‌గా మాట్లాడుతుంటారు. జ‌రిగేదే కాదు, భ‌విష్య‌త్‌లో జర‌గ‌బోయేది కూడా చెప్ప‌గలిగేంత దివ్య దృష్టి ఆయ‌న‌కు ఉంది. ఇంత‌టి రాజ‌కీయ మేధావిపై నెటిజ‌న్లు…

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఢిల్లీలో కూచుని నిత్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై చ‌క్క‌గా మాట్లాడుతుంటారు. జ‌రిగేదే కాదు, భ‌విష్య‌త్‌లో జర‌గ‌బోయేది కూడా చెప్ప‌గలిగేంత దివ్య దృష్టి ఆయ‌న‌కు ఉంది. ఇంత‌టి రాజ‌కీయ మేధావిపై నెటిజ‌న్లు మాత్రం ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌రింకా ఎంత కాలం సిగ్గు, శ‌రం లేకుండా రాజ‌కీయ జీవితం గ‌డుపుతార‌నే ప్ర‌శ్న‌, నిల‌దీత‌లు నెటిజ‌న్ల నుంచి ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  చంద్ర‌బాబు అనుమ‌తిస్తే త‌మ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన త‌మ పార్టీ నాయ‌కులు టీడీపీ అధిష్టానంతో ట‌చ్‌లో ఉన్నార‌నే స‌మాచారం వుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఎంతో రాజ‌కీయ చ‌రిత్ర కలిగిన కుటుంబాల‌కు చెందిన నాయ‌కుల‌ను త‌మ పార్టీ పెద్ద‌లు ఏక‌వ‌చనంతో సంబోధించ‌డం వ‌ల్లే టీడీపీలో చేరాల్సిన దుస్థితికి కార‌ణ‌మైంద‌ని ఆయ‌న అన్నారు.

ఎమ్మెల్యేలు స‌రే, ఇంత‌కూ త‌మ‌రి చేరిక ఎప్పుడో చెప్ప‌లేదేం అనే ప్ర‌శ్న నెటిజ‌న్ల నుంచి వ‌స్తోంది. త‌మ‌రిని చేర్చుకోడానికి చంద్ర‌బాబు ప‌చ్చ జెండా ఊప‌లేదా? ఇంకా ఎంత కాల‌మ‌ని ఇలా టీడీపీ ప్ర‌యోజ‌నాల‌ను వాడుకోవాల‌ని చూస్తున్నారో చెప్ప‌వా? అని నిల‌దీస్తున్నారు. మ‌న వాడివి కాబ‌ట్టే రోజూ విమ‌ర్శ‌లు చేస్తుంటే, స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని పుట్టిన రోజు నాడు తీపి జ్ఞాప‌కంగా ట్రీట్ ఇచ్చార‌ని నెటిజ‌న్లు సెటైర్స్ వేస్తున్నారు.

ఏక‌వ‌చ‌నంతో పిల‌వ‌డం వ‌ల్ల అవ‌మానంగా భావించి నెల్లూరు పెద్ద రెడ్లు వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే మాట … కాసేపు మీరు చెప్పిన‌ట్టు నిజ‌మే అనుకున్నామ‌ని, మ‌రి మిమ్మ‌ల్ని చిత‌క్కొట్టినా వైసీపీని ఎందుకు వీడ‌లేద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎవ‌రెవ‌రో టీడీపీలో చేరుతార‌ని చెబుతున్న ర‌ఘురామ‌, తానే పార్టీలో చేర‌బోతున్నారో ఎందుకు ప్ర‌క‌టించ‌లేదో స‌మాధానం చెప్పాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. మ‌రీ రోషం లేకుండా బ‌త‌క‌డం రాజుగారికి త‌గ‌ద‌నే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.