వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శనివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెంటనే విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె పోటుగా వైద్యులు తేల్చారు. యాంజియో గ్రామ్ చేసి స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు వైద్యులు చెప్పారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పార్థసారథి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. జగన్ రెండో దఫా కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. మంత్రి పదవి రాకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత సర్దుకుపోయారు. వైసీపీ వాయిస్‌ను బలంగా వినిపించడంతో ఆయన ముందుంటారు. టీవీ డిబేట్లలో తరచూ పాల్గొంటూ ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పి కొడుతుంటారు. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకుని వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాకే చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గుండె పోటుకు గురయ్యారు. ఆయనకూ యాంజియో గ్రామ్ చేసి స్టంట్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లి రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు.