తెలుగు తమ్ముడు గట్టిగానే తగులుకున్నాడు. బాగానే నిలదీశాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ పెద్ద అమిత్ షాకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, రైల్వే జోన్ మీద సభ ద్వారా జవాబు చెప్పమన్నాడు. విశాఖలో మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన మీద విజయోత్సవాలు చేసుకోవడం కాదు, ఏపీకి ఏం చేశారో చెప్పమని గట్టిగానే టీడీపీ తమ్ముడు అడిగాడు.
ఢిల్లీలో అమిత్ షాను కలసి వచ్చి ఏపీలో కేవలం వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్న చంద్రబాబు కంటే విశాఖ తమ్ముడు నయం అనిపించాడని అంటున్నారు. విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అమిత్ షా వైజాగ్ టూర్ నేపధ్యంలో విశాఖ స్టీల్ ని ప్రైవేట్ కానీయబోమని హామీ ఇవ్వాలని అంటునారు.
అలాగే ఏపీకి ఇచ్చిన హామీల మీద మాట్లాడాలని గట్టిగా కోరారు. పనిలో పనిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్ట్ చేసే విషయంలో కేంద్రం ఉదాశీనంగా ఎందుకు ఉందో తెలియచెప్పాలని పార్టీ లైన్ లో మరో డిమాండ్ కూడా చేశారు.
ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు ఉంటాయని ఒక వైపు వార్తలు వస్తున్న నేపధ్యంలో బీజేపీ ఏమి చేసినా మాట్లాడని ఏపీ టీడీపీ టీడీపీ అధినాయకత్వం మరో వైపు ఉన్న క్రమంలో పల్లా శ్రీనివాసరావు అమిత్ షా మీద విమర్శలు చేయడం అంటే తమ్ముడు బాగానే తగులుకున్నాడే అనిపించక మానదు. దీని మీద బీజేపీ ఏమంటుందో తరువాత సంగతి కానీ టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అన్నదే చూడాలి.