జ‌గ‌న్ వ‌ద్ద‌నుకున్నోళ్లంతా బాబు చెంత‌కు…!

వీళ్లు వ‌ద్దు అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అనుకుని, పార్టీ నుంచి వెలివేత‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యేలంతా నారా లోకేశ్ చెంత‌కు చేరుతున్నారు. ఈ జాబితాలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి…

వీళ్లు వ‌ద్దు అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అనుకుని, పార్టీ నుంచి వెలివేత‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యేలంతా నారా లోకేశ్ చెంత‌కు చేరుతున్నారు. ఈ జాబితాలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ఉన్నారు. వీరిలో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ఇవాళ నారా లోకేశ్‌ను క‌లుసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేశార‌నే కార‌ణంతో మేక‌పాటితో పాటు మ‌రో ముగ్గురిని వైసీపీ నుంచి జ‌గ‌న్ బ‌య‌టికి సాగ‌నంపారు.

దీంతో వారంద‌రికీ టీడీపీ ప్ర‌త్యామ్నాయ పార్టీగా క‌నిపించింది. యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న నారా లోకేశ్ రాయ‌ల‌సీమలో పూర్తి చేసుకునే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. నెల్లూరు జిల్లాలో ఆయ‌న పాద‌యాత్ర అడుగు పెట్ట‌నున్న త‌రుణంలో మేక‌పాటి యాక్టీవ్ అయ్యారు. లోకేశ్‌ను క‌లిసి చ‌ర్చించారు. త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్న‌ట్టు మేక‌పాటి ప్ర‌క‌టించారు. వైసీపీలో టికెట్ ఇవ్వ‌న‌ని , ఎమ్మెల్సీతో స‌రిపెట్టుకోవాల‌ని జ‌గ‌న్ త‌న‌కు తేల్చి చెప్పార‌ని మేక‌పాటి ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

మేక‌పాటి వైవాహిక జీవితం వివాదాస్ప‌దం. దీంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌లుచ‌న అయ్యార‌ని, ఒక‌వేళ టికెట్ ఇచ్చినా గెల‌వ‌లేర‌ని జ‌గ‌న్ గుర్తించారు. దీంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్ట‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని నేరుగా చంద్ర‌శేఖ‌ర‌రెడ్డితోనే జ‌గ‌న్ చెప్పారు. అలాంటి మేక‌పాటిని టీడీపీలో చేర్చుకోవ‌డం ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ ఏం సాధించాల‌ని అనుకుంటున్నార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 

టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇస్తామ‌నే హామీ ఇస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చివ‌రికి టీడీపీలో వైసీపీ వ‌ద్ద‌నుకుంటున్న నేత‌లు చేరుతున్నార‌నే నెగెటివ్ చ‌ర్చ జ‌రుగుతోంది.