తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బాగుపడ్డ పార్టీ చరిత్రలో లేదు! అవతల పార్టీని పీల్చి పిప్పి చేయడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా చరిత్రలో అంతా ఇదే కథ. ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చెప్పుకోదగిన రాజకీయ శక్తులు. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని.. తమ సత్తా చూపించిన కమ్యూనిస్టు పార్టీలు 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పతానవస్థలోకి కూరుపోయారు. 2009 నుంచినే ఉమ్మడి ఏపీలోకమ్యూనిస్టుల ప్రాభవం పాతాళ స్థాయికి చేరడం మొదలైంది. ఆ తర్వాత మళ్లీ కోలుకోనే లేదు.
2004లోనే కాంగ్రెస్ తో పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి ఉనికిని చాటుకుంది. 2009లో చంద్రబాబుతో వెళ్లి చంద్రశేఖరరావు పార్టీ చిత్తు చిత్తు అయ్యింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ అభాసుపాలయ్యింది. ఎన్ని స్థానాలకు పోటీ చేశారు. ఎన్ని గెలిచారు.. అంటూ గేలి చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉన్నా.. టీడీపీతో పొత్తు మాత్రం ఆ పార్టీ పరువును తీసింది తప్ప ఇంకో ప్రయోజనాన్ని కలిగించలేదు. 2009నాటి పరిణామాలు సంభవించకపోయి ఉంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకున్న 2009 ఎన్నికలే టీఆర్ఎస్ కు బహుశా చివరాఖరివి అయ్యేవి!
ఇక చివరి సారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని చిత్తయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో చేతులు కలపడం కాంగ్రెస్ కు పెనుశాపం అయ్యింది. చిత్తు చిత్తుగా ఆ పార్టీ ఓటమి పాలైంది.
ఇక చంద్రబాబుతో పొత్తు వల్ల ఇప్పటికీ తాడూబొంగరం లేని పార్టీగా బీజేపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. 1999 లోక్ సభ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీలో సొంతంగా ఆరు ఎంపీ సీట్లను నెగ్గిన పార్టీ బీజేపీ. ఎప్పుడైతే 1999 లో టీడీపీ-బీజేపీ పొత్తు ఖరారు అయ్యిందో అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో బీజేపీ డొల్లగా మారింది. చంద్రబాబు మాట విని 2004 ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి బీజేపీ కేంద్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది. అక్కడ నుంచి బీజేపీ ని తన అవసరం మేరకు చంద్రబాబు ట్రీట్ చేస్తున్నాడు. అవసరం ఉందనుకుంటే పొగడటం, లేదంటే తిట్టడం!
ఇదీ చంద్రబాబుతో పొత్తులు నడిపిన పార్టీల పరిస్థితి. చంద్రబాబుతో పొత్తుఅంటే అది దృతరాష్ట్ర కౌగిలి. మరి ఆ కౌగిలిలో చిక్కుకునేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా ఆరాటపడుతూ ఉన్నాడు. చంద్రబాబు చెప్పిందల్లా చేస్తూ ఇప్పటికే పవన్ చాలా పరువు పొగొట్టుకున్నాడు.
పవన్ రెండు చోట్ల ఓడటం కూడా చంద్రబాబుతో ఆయన సాగిస్తున్న స్నేహం ఫలితమే తప్ప మరోటి కాదు. అయినా పవన్ కు చంద్రబాబు కౌగిలే హాయిగా ఉంది. మరి బీజేపీ అయితే ఈపాటికి చాలా పాఠాలు నేర్చుకుని ఉండాలి. ఆ మాత్రం అనుభవం ఉన్న నేతలే ఆ పార్టీని కేంద్రం నుంచి నడిపిస్తున్నారు. అయినా మరోసారి కమలం పార్టీ చంద్రబాబు వలలో చిక్కుకుంటే అబ్బే.. అనుకోవాల్సి వస్తుంది.
అయినా ఈ సారి చంద్రబాబుతో బీజేపీ బేరానికి దిగితే మామూలుగా ఉండదని తనకు, జనసేనకుకలిపి ఆ పార్టీ కనీసం 75 సీట్లు అడుగుతుందనే టాక్ కూడా నడుస్తోంది. మరి ఈ పొత్తు ఏ మేరకు పొడుస్తుందో!