టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనకు ఘోర పరాజయం తర్వాత కూడా ఏ మాత్రం మారలేదు. పైగా తనను ఓడించిన ప్రజలే తప్పు చేశారనే భావన, కోపం ఆయనలో బలంగా ఉన్నాయి. తాజాగా ఆయన మాటలను జాగ్రత్తగా గమనిస్తే ….ప్రజలపై చంద్రబాబు ఎంత అక్కసుతో ఉన్నారో అర్థమవుతుంది.
ఓటమి విజయానికి తొలి మెట్టు అని పెద్దలు అంటారు. తమ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై అధ్యయనం చేసుకుంటే, ఎవరికైనా ఓ సమాధానం దొరుకుతుంది. భవిష్యత్‌లో అలాంటి తప్పులేవీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గుణపాఠాల్ని కూడా నేర్చుకోవచ్చు.
అయితే చంద్రబాబు విషయంలో మాత్రం అంతా రివర్స్. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోగా, అహంకారం పెరగడాన్ని చూడొచ్చు. అంతేకాదు, తనను ఓడించిన ప్రజలపై ద్వేషాగ్నితో రగిలిపోతున్న వాస్తవాన్ని …భోగి మంటల వెలుగు స్పష్టంగా పట్టిచ్చింది.
కృష్ణా జిల్లా పరిటాలలో బుధవారం నిర్వహించిన భోగి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారని మండిపడ్డారు.
తానేం తప్పు చేశానో తెలీదని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తన పాలనలో కృషి చేశానన్నారు. అదే తాను చేసిన తప్పయితే క్షమించాలని చంద్రబాబు ఆవేదనతో వేడుకోవడం గమనార్హం. చంద్రబాబు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో జనం లేరు.
తన పాలనంతా ప్రజారంజకంగా సాగి ఉంటే …ప్రజలు అజ్ఞానులై ఓడించారని చంద్రబాబు భావిస్తున్నారా? 2014లో విభజిత రాష్ట్రానికి ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మాత్రం …నాడు తన రాజకీయ, పాలనానుభవాన్ని చూసి గెలిపించారనడం గుర్తు లేదా? తనను గెలిపిస్తే మాత్రం ప్రజలు దేవుళ్లు …ఓడిస్తే దెయ్యాలు అనే రీతిలో చంద్రబాబు వైఖరి ఉంది.
జగన్‌కు పూనకం వచ్చినట్టు ఓట్లేశారనడంలోనూ, అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పయితే క్షమించాలని చెప్పడంలోనూ ప్రజలను కించపరచడం తప్ప మరొకటి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాస్వామ్యమన్న తర్వాత గెలు పోటములు సర్వసాధారణమని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాలా? ఓడించిన జనాన్ని ఈ స్థాయిలో ఆడిపోసుకున్న నాయకులను ఇంతకు ముందెప్పుడూ చూడలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలుగు సమాజమంతా భోగి మంటలతో సంబరాలు చేసుకుంటుంటే… చంద్రబాబు మాత్రం ద్వేషాగ్నితో రగిలిపోతుండడం గమనార్హం.