మోదీని జ‌గ‌న్ ప్ర‌స‌న్నం ఎలా చేసుకున్నారంటే!

ప్ర‌ధాని మోదీని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ విధంగా ప్ర‌స‌న్నం చేసుకున్నారో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు త‌న‌దైన రీతిలో చెప్పారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ఆ…

ప్ర‌ధాని మోదీని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ విధంగా ప్ర‌స‌న్నం చేసుకున్నారో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు త‌న‌దైన రీతిలో చెప్పారు. తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. న‌డ్డా స‌మ‌క్షంలో సోము వీర్రాజు ప్ర‌సంగిస్తూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై చెల‌రేగిపోయారు.

ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి త‌ప్ప‌, జ‌గ‌న్ స‌ర్కార్ చేసిందేమీ లేద‌ని విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌తి వారం ఢిల్లీ వెళ్లి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఫొటో, ల‌డ్డూలు ఇచ్చి ప్ర‌ధాని మోదీని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నార‌ని వీర్రాజు చెప్ప‌డం విశేషం. వీర్రాజు అమాయ‌క‌త్వం ఏ స్థాయిలో వుందో తాజా కామెంట్స్ నిద‌ర్శ‌నం. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రస్వామి, తిరుమ‌ల ల‌డ్డూల‌కే మోదీ మెచ్చి, జ‌గ‌న్ అడిగిన‌వ‌న్నీ చేస్తున్నార‌ని వీర్రాజు ప‌రోక్షంగా కితాబిచ్చిన‌ట్టైంది.

మోదీ ప్ర‌స‌న్నం కావ‌డం అంటే అర్థం అదే. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రానికి నిధుల‌ను భారీ మొత్తంలో కేంద్రం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ద‌న్నుగా నిలుస్తూ, మ‌రోవైపు ఎవ‌రి కోస‌మో అన్న‌ట్టు విమ‌ర్శ‌లు చేయ‌డం బీజేపీ నేత‌ల‌కే చెల్లింది. ముఖ్యంగా సోము వీర్రాజును టీడీపీ, ఎల్లో మీడియా జ‌గ‌న్ అనుకూల అధ్య‌క్షుడిగా ప‌రిగ‌ణిస్తోంది. వీర్రాజు బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలంగా టీడీపీతో పొత్తు కుద‌ర‌నివ్వ‌డ‌మే అభిప్రాయం ప‌చ్చ బ్యాచ్‌లో బ‌లంగా ఉంది.

మ‌రోవైపు జ‌గ‌న్ అనుకూల నేత అనే ముద్ర నుంచి బ‌య‌ట ప‌డేందుకు వీర్రాజు త‌ప‌న ప‌డుతున్నారు. అందుకే పార్టీ అగ్ర‌నేత‌ల ఎదుట సీఎం జ‌గ‌న్‌పై వీర్రాజు రెచ్చిపోయి మాట్లాడ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌ధాని మోదీ అంటే జ‌గ‌న్‌కు గౌర‌వం లేద‌నే కామెడీ కామెంట్స్ కూడా సోము వీర్రాజు చేశారు. 

వైఎస్ జ‌గ‌న్ దిగ‌జారిపోయాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 25 పార్ల‌మెంట్ స్థానాల్లో, 26 జిల్లాల్లో ఇలాంటి స‌భ‌లే పెట్టి, వైసీపీ అవినీతిపై ప్ర‌జ‌ల‌కు చెబుతామ‌న్నారు. కేంద్రం ఇచ్చే డ‌బ్బుల‌కు జ‌గ‌న్ త‌న స్టిక్క‌ర్ల‌ను వేసుకుని మోసం చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వీర్రాజు ప‌ని చేస్తున్నార‌నేందుకు ఈ పాటి డోస్ స‌రిపోతుందా? లేదా? అని సీఎం ర‌మేశ్‌, సుజ‌నాచౌద‌రి, స‌త్య‌కుమార్‌ను అడిగితే బాగా చెబుతారు.