జనసేనాని పవన్‌కల్యాణ్‌పై నాగబాబుకు విపరీతమైన ప్రేమ. తమ్ముడిని నాగబాబు చాలా ఉన్నతంగా ఊహిస్తూ వుంటారు. ఒకవైపు పవన్‌కల్యాణ్ తాను సీఎం అభ్యర్థి కానే కాదు కుయ్యో మొర్రో అంటుంటే… నాగబాబు మాత్రం లేదు లేదు, నువ్వే మా కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. జనసేన ప్రభుత్వం వస్తేనే, ఏపీకి భవిష్యత్ వుంటుందని నాగబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ వెంట నడుస్తున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకుంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ప్రత్యర్థులు తమదైన రీతిలో సెటైర్స్ విసురుతున్నారు. ముందుగా నాగబాబు ట్వీట్ సంగతేంటో చూద్దాం.
“అతను పిల్లాడిగా ఉన్నప్పుడు సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పించాను. ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్లయ్యాం. పవన్‌కల్యాణ్ ఉన్నత స్థానాలను అధిరోహించాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన పెంపొందించుకున్నాడు. అందుకే అతని అడుగు జాడల్లో నేను నడుస్తున్నా” అని ట్వీట్ చేశారు.
అదేంటి పవన్‌కల్యాణే తన దత్త తండ్రి చంద్రబాబు వెంట నడుస్తున్నారని లోకమంతా కోడై కూస్తోందని, మీరు మాత్రం అందుకు విరుద్ధంగా ట్వీట్ చేశారే అని నాగబాబును నెటిజన్లు దెప్పి పొడిచారు. తమ్ముడిని టీడీపీ అధినేత చంద్రబాబు తన దారిలోకి తెచ్చుకున్నారని, ఇంతకూ మీ మార్గం ఏదో చెప్పండి అంటూ నాగబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి నెటిజన్ల ఏకాభిప్రాయం ఏంటంటే పవన్‌కల్యాణ్‌కు సొంతంగా ఒక దారి లేదు. బాబు వేసిన దారే పవన్‌కు దిక్కైందంటూ నాగబాబు ట్వీట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.