ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల నుంచి ఏటీఎంలు కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఏటీఎం ముందు బారెడు క్యూలు. నగదు పెట్టిన కాసేపట్లోనే మిషన్లు ఖాళీ అవుతున్నాయి!
ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కొంపదీసి కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఏ నోట్ల రద్దునో అనౌన్స్ చేయలేదు కదా? లేక రేపోమాపో ఈ కర్ఫ్యూనో విధించడం లేదు కదా.. అని ఆలోచించాల్సినట్టుగా ఉంది వ్యవహారం. ఇంతకీ ఏటీఎంలు ఇలా కిటకిటలాడటానికి కారణం ఏమిటంటే.. అమ్మ ఒడి డబ్బులు ఖాతాల్లోకి పడటం!
తమ ఖాతాల్లో పడ్డ అమ్మ ఒడి డబ్బులను డ్రా చేసుకోవడానికి ప్రజలు ఏటీఎంలపై దండెత్తారు. ఓ మోస్తరు పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్లలో అయితే.. సోమవారం సాయంత్రం నుంచినే ఏటీఎంల ముందు క్యూలు ఏర్పడ్డాయి. సోమవారమే చాలా మంది ఏటీఎంల నుంచి నగదును ఊడ్చుకెళ్లారు.
ఇక మంగళవారం అయితే.. డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన వారికి భారీ వెయిటింగ్ తప్పలేదు! ఒక్కో చోట కనీసం రెండు గంటల సమయం పట్టేంతలా క్యూలు ఏర్పడ్డాయి. మామూలుగానే ఇప్పుడు క్యాష్ దొరకడం కాస్త కష్టమే. అలాంటిది ఒక్కసారిగా ప్రతి ఏటీఎం మీదా వందల మంది పడటంతో.. కరెన్సీ కటకట అయ్యింది.
పండగ ముందు కావడంతో.. ప్రజలు ఖాతాల్లో పడ్డ నగదును డ్రా చేసుకోవడానికి పోటీలు పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ ఒడితో సంబంధం లేకుండా వ్యక్తిగత డబ్బులను డ్రా చేసుకోవడానికి వెళ్లిన వారికి కూడా ఏటీఎంలలో ఇబ్బందులు తప్పలేదు.
భారీ క్యూలు, ఏటీఎంలలో కాసేపటికే నగదు ఖాళీ కావడంతో క్యాష్ అవసరాలు ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. ఇక రేపు బ్యాంకులకు కూడా సెలవు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే నగదు నిండుకున్న ఏటీఎంలలో క్యాష్ నింపడం కూడా ఉండకపోవచ్చు. అమ్మ ఒడి పథకం దెబ్బకు.. ఏటీఎంల ముందు సందడి వాతావరణం నెలకొని, ఏపీలో ఉన్నఫలంగా క్యాష్ క్రంచ్ ఏర్పడే పరిస్థితి రావడం గమనార్హం!