వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వేడుక నాగబాబు ఇంట శుక్రవారం వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య ఈ సంబరం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ చెల్లి నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో నాగబాబు ముద్దుల కూతురు నిహారిక అన్నపై ఆప్యాయంగా తలవాల్చి నిలిచారు. ఇందులో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య లేకపోవడం సర్వత్రా ఈ ఫొటో చర్చనీయాంశమైంది. నిహారిక, చైతన్య జంట విడిపోయారని కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో విడిపోయారనే ప్రచారానికి బలం కలిగించేలా నిహారిక తన ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేసిన ఫొటో ఉంది.
నిశ్చితార్థ వేడుకకు చైతన్య వెళ్లలేదనే విషయాన్ని నిహారిక పరోక్షంగా చెప్పకనే చెప్పారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ముందు నిహారిక తప్పకుండా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి వుంటారని, ఎందుకంటే చైతన్య ఎక్కడనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని ఆమెకి బాగా తెలుసని నెటిజన్లు అంటున్నారు.
చైతన్యతో తన సంబంధాలపై ఒక మెసేజ్‌ను ఈ ఫొటో ద్వారా పంపాలనే ఉద్దేశంతోనే నిహారిక తెలివిగా వ్యవహరించిందనే వాళ్లు లేకపోలేదు. ఇలా నిహారిక షేర్ చేసిన ఒకే ఒక్క ఫొటోపై చర్చ కాస్త రచ్చగా మారిందంటే అతిశయోక్తి కాదు.