మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ నేతగా ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. నడ్డా సమక్షంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజా జీవితంలో ఉండాలా? వద్దా? అని ఇన్ని రోజులు ఆలోచించానన్నారు. జాతీయ పార్టీలో వుంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతోందన్నారు.
కిరణ్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగలేకపోయారనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడం వల్లే ఆ పార్టీ కండువా కప్పుకున్నారని జగమెరిగిన సత్యమంటూ ఆయన్ను తప్పు పడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవిని అనుభవించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ దెబ్బతినడంతో బీజేపీలో చేరడం నిజం కాదా? అంటూ ఆయన్ను నెటిజన్లు నిలదీస్తున్నారు.
ప్రజా జీవితంలోకి వచ్చి ఏం సాధిస్తారని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో లాస్ట్ బాల్‌కు అద్భుతాలేవో జరుగుతాయని నమ్మించి, ఊరించి చివరికి చేతులేత్తేశారని ఆయనపై మండిపడుతున్నారు. ప్రజాదరణ లేని ఇలాంటి వారంతా చేరి బీజేపీకి ఏం లాభం కలిగిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. జాతీయ నాయకులు పాల్గొంటున్న కార్యక్రమాలకు హాజరవడం ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు కిరణ్ ప్రయత్నిస్తున్నారనేది వాస్తవం.