కుటుంబ పెత్తనంలో సాగే రాజకీయ పార్టీలు మనకు కొత్త కాదు. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సోనియా కుటుంబం పట్ల పార్టీలోని సీనియర్ నాయకులు అందరూ వీరవిధేయతను ప్రదర్శిస్తుంటారు. స్వామిభక్తి విషయంలో కాంగ్రెస్ నాయకుల పోకడలు తతిమ్మా అన్ని పార్టీలను తలదన్నేలా ఉంటాయి. స్వామిని మించిన స్వామి భక్తి వారి సొంతం. అలాంటి అతి స్వామిభక్తికి తార్కాణం వంటి ఘటన ఇది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ప్రియాంక వధేరాను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
సోనియా కుటుంబ భజన అనేది కాంగ్రెస్ పార్టీలో తమకు స్థిరమైన కెరీర్ను, అభివృద్ధిని ఇస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తూ ఉంటారేమో తెలియదు. కానీ చాలా మంది నాయకులు ఎప్పటికీ నమ్ముకునే సిద్ధాంతం అదే.
తాజాగా తెలంగాణ పీసీసీ మేధావుల విభాగం కమిటీ సభ్యులందరూ గాంధీభవన్ లో సమావేశం అయ్యారు. వి.హనుమంతరావు, జి.నిరంజన్, కమలాకర్ రావు లాంటి వారు ఈ కమిటీలో ఉన్నారు. మేధావుల కమిటీ అధ్యక్షుడు శ్యాంమోహన్ ఫైనల్ గా మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ వధేరాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయించాలని అధిష్ఠానాన్ని కోరనున్నట్టు ప్రకటించారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అంటే ఒకప్పట్లో కాంగ్రెస్ ను కూడా ఆదరించిన నియోజకవర్గమే. 1980లో ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత ఒక దఫా తెలుగుదేశానికి అప్పగించినా.. ఎం. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ తరఫున ఇక్కడినుంచి గెలిచారు. 1999లో బిజెపి అభ్యర్థిగా ఆలె నరేంద్ర గెలుపొందగా.. ఆ తర్వాత ఇప్పటిదాకా అక్కడ భారాసకు ఎదురులేని పరిస్థితి ఉంది.
భారాస తరఫున విజయశాంతి, కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా అక్కడ గెలిచారు. 2019 నాటి తాజా ఎన్నికలను పరిశీలిస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మీద ఏకంగా 3.16 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదేమీ చిన్న సంగతి కాదు. గులాబీ దళం ఇక్కడ చాలా బలంగా ఉన్నట్టు పరిగణించాలి. ఇలాంటి సీటునుంచి పోటీచేయాలని ప్రియాంక గాంధీని ఆహ్వానించడం ఏమిటో అర్థం కాని సంగతి. అది కూడా తెలంగాణ పీసీసీలోని మేధావులందరూ కలిసి ఇలాంటి నిర్ణయానికి రావడమే విచిత్రం.
బహుశా.. ఇందిర వారసురాలిగా కాంగ్రెసులోని నెహ్రూకుటుంబ భక్తులకు ఆదరణీయ నాయకురాలు అయిన ప్రియాంక గాంధీని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నారా అనేది తెలియదు. గతంలో ఇందిరాగాంధీ గెలిచిన సీటు కాబట్టి.. నానమ్మ వారసురాలిగా గెలవడానికి ఆ సీటునుంచి బరిలోకి దిగాలని వారు సెంటిమెంట్ ప్లే చేస్తుండవచ్చు. కానీ వాస్తవంలో.. సెంటిమెంటు కాదు, అక్కడ ప్రస్తుతం పార్టీకి ఉన్న బలం ఏమిటో వారు గుర్తించుకోవాల్సి ఉంది.