విశాఖ నిప్పుల కుంపటిలా ఉంది. కూల్ సిటీ కాస్తా సెగలూ పొగలూ కక్కుతోంది. వేసవి ఎండలు తగ్గుతున్నాయనుకుంటే జూన్ నెలలో అగ్గి మీద సిటీ కూర్చున్నట్లుగా పరిస్థితి తయారైంది. విశాఖలో గత కొద్ది రోజులుగా నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ని మించి ఎండలు కాస్తున్నాయి. శుక్రవారం చూస్తే ఏకంగా 42 డిగ్రీలను దాటేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
ఇదే పరిస్థితి రానున్న మరి కొద్ది రోజులలో కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది. ఒక వైపు నైరుతి రుతు పవనాలు రాక ఆలస్యం కావడం ఇంకో వైపు వేసవి ఎండలు మళ్లీ ముదరడంతో స్మార్ట్ సిటీ హీటెక్కిపోతోంది.
వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు విశాఖ బీచ్ ల వద్ద జనం పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు సాగర జలాల్లో ఈత కొడుతూ కాస్తా ఉపశమనం పొందుతున్నారు. విశాఖ సిటీలో ఇంత పెద ఎత్తున ఎండలు కాయడంతో మధ్యాహ్నం పూట వాతావరణం కర్ఫ్యూని తలపిస్తోంది.
వడగాలులతో సాగర తీరం గరం గరం గా ఉంది. సముద్రపు నీరు ఆవిరిగా మారి ఆ తెట్ట గాలిలో కలిసి మరింత ఉష్ణోగ్రతలను పెంచుతోంది అని అంటున్నారు. ఉక్కబోతతో పాటు తేమతో విశాఖ వాసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఈ నెల 15 తరువాత కానీ వాతావరణంలో మార్పు కనిపించదన్న వార్తలు ఉక్కు నగరాన్ని కలవరపెడుతున్నాయి. విశాఖ ఎన్నడూ చూడని దారుణమైన పరిస్థితిని చూస్తోందని అంటున్నారు.