తను గర్భందాల్చిన విషయాన్ని చెప్పిన ఇలియానా, ఆ గర్భానికి కారణమైన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. గోవా బ్యూటీకి పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ చర్చలకు మరింత ఊతమిస్తూ, ఎప్పటికప్పుడు లీకులిస్తూనే ఉంది ఇల్లీ బేబీ.
తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి ఇప్పటికే ఓ స్టిల్ రిలీజ్ చేసింది ఇలియానా. చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్ ను మాత్రం పోస్ట్ చేసి సరిపెట్టుకోమంది. ఇప్పుడీ అంశానికి సంబంధించి ఎపిసోడ్-2ను రిలీజ్ చేసింది.
తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గడిపిన ఓ మధుర క్షణాన్ని ఆమె బయటపెట్టింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫొటోలో క్లారిటీ లేదు. బ్లర్ అయిన స్టిల్ ను మాత్రమే విడుదల చేసి, తన బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ఇలియానా.
“నన్ను నేను నిర్లక్ష్యం చేసుకున్న టైమ్ లో ఈ మనోహరమైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. నాకు సపోర్ట్ గా నిలిచాడు. నేను పడిపోతున్నానని భావించినప్పుడు అతడు నన్ను పట్టుకున్నాడు. నా కన్నీళ్లు తుడిచాడు. నన్ను నవ్వించడానికి జోకులేశాడు. ఏ క్షణంలో నాకు సాంత్వన అవసరమో తెలుసుకొని, ఆ మూమెంట్ లో నన్ను అక్కున చేర్చుకున్నాడు.”
జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, అవేవీ మనం ఊహించుకునేంత పెద్దవి కావని, ఇలాంటి వ్యక్తి చేతిలో మన చేయి ఉన్నప్పుడు ఆ కష్టం చిన్నదిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది ఇలియానా. బిడ్డ పుట్టే టైమ్ కు బాయ్ ఫ్రెండ్ ను ఇలా దశలవారీగా పరిచయం చేయాలని ఆమె భావిస్తున్నట్టుంది.