అప్సర హత్య.. తవ్వేకొద్దీ వెలుగులోకి షాకింగ్ ట్విస్టులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో గంటగంటకు కొత్త ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. పూజారి సాయికృష్ణ చాలా అబద్ధాలు చెప్పాడని తెలిసొచ్చింది.…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో గంటగంటకు కొత్త ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. పూజారి సాయికృష్ణ చాలా అబద్ధాలు చెప్పాడని తెలిసొచ్చింది.

పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతోంది..

చనిపోయిన వారం రోజుల తర్వాత అప్సర మృతదేహాన్ని కనుగొన్న పోలీసులకు, ఇవాళ్టి పోస్టుమార్టం రిపోర్టుతో మరిన్ని వివరాలు తెలిసొచ్చాయి. ఆమె ఎలా మరణించిందనే విషయంతో పాటు మరో షాకింగ్ మేటర్ కూడా పోలీసులు తెలుసుకున్నారు. ముందుగా అప్సర ఎలా మృతి చెందిందో తెలుసుకుందాం.

తలపై బలమైన గాయం అవ్వడం వల్లనే అప్సర చనిపోయినట్టు, ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నివేదికలో తేల్చిచెప్పారు. ఇక్కడివరకు క్లియర్ గానే ఉంది. ఎందుకంటే, రిమాండ్ లో పూజారి సాయికృష్ణ కూడా ఇదే విషయం చెప్పాడు. బెల్లంకొట్టే వస్తువుతో అప్సర తలపై బలంగా మోదినట్టు సాయికృష్ణ అంగీకరించాడు. అయితే పోలీసులు షాక్ అయ్యే మేటర్ ఇది కాదు.

అప్సర గర్భందాల్చిందనే విషయాన్ని సాయికృష్ణ వెల్లడించాడు. తను గర్భవతినని, తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసిందని, పెళ్లి చేసుకోకపోతే తన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని, ఈ బెదిరింపులకు తట్టుకోలేక ఆమెను హత్య చేశానని సాయికృష్ణ పోలీసులకు వెల్లడించాడు. కానీ ఈరోజు బయటకొచ్చిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం అప్సర గర్భవతి కాదనే విషయాన్ని వైద్యులు నిర్థారించారు. సరిగ్గా ఇక్కడే కుటుంబ సభ్యుల వాదనలు తెరపైకొస్తున్నాయి..

కుటుంబ సభ్యుల వాదన ఏంటి?

అప్సరకు లొంగదీసుకున్నాడని, పెళ్లి చేసుకోమని అడగడంతో ఆమెను చంపేశాడని అప్సర తల్లి ఆరోపిస్తోంది. అటు సాయికృష్ణ భార్య మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైన వాదన వినిపిస్తోంది. అప్సర హత్య యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడిన ఆమె, తన భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదని, టార్చర్ భరించలేక క్షణికావేశంలో అలా చేసి ఉంటాడని చెబుతున్నారు. అప్సరతో తన భర్త మాట్లాడుతుంటాడని, తన ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమానికి కూడా ఆమె హాజరైందని తెలిపిన సాయికృష్ణ భార్య.. అప్సరతో తన భర్తకు ఎలాంటి రిలేషన్ లేదని అంటోంది. తన భర్తను కావాలనే ట్రాప్ చేశారని, అప్సర లేట్ నైట్స్ ఇంటికొస్తుంటే, వాళ్ల అమ్మ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తోంది.

మరోవైపు ఇదే అంశంపై రిమాండ్ లో ఉన్న సాయికృష్ణ కూడా మాటమార్చాడు. అప్సరకు చెన్నైలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేది సాయికృష్ణ తాజా వాదన. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారని, మధ్యలో తనను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పుకొచ్చాడు. అప్సరతో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదంటున్నాడు.

హత్య కోసం గూగుల్ సెర్చ్

సాయికృష్ణతో పాటు మిగతా కుటుంబ సభ్యుల వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ హత్య చేసింది మాత్రం సాయికృష్ణ అనే విషయాన్ని పోలీసులు నిర్థారించారు. దీనికి సంబంధించి బలమైన టెక్నికల్ ఆధారాల్ని కూడా వీళ్లు ఇప్పటికే సేకరించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫూటేజ్ తో పాటు.. హత్యకు వాడిన వస్తువును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడీ హత్యకు మరింత బలం చేకూరుస్తూ.. సాయికృష్ణ గూగుల్ సెర్చ్ డేటాను కూడా వెలికితీశారు పోలీసులు. హత్యకు 10 రోజుల ముందు 'ఓ మనిషిని చంపడం ఎలా' అంటూ గూగుల్ లో సాయికృష్ణ సెర్చ్ చేసిన విషయాన్ని పోలీసులు కనుగొన్నారు.

జైలులో సాయికృష్ణ హంగామా

మరోవైపు రిమాండ్ లో ఉన్న సాయికృష్ణ నానా హంగామా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై అబద్ధాలు చెప్పి, మాటలు మార్చిన పూజారి, తను ఆత్మహత్య చేసుకుంటానంటూ తాజాగా పోలీసుల్ని బెదిరించడం సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు సాయికృష్ణ, 2 వారాల పాటు పోలీసుల రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈరోజు అప్సర అంత్యక్రియలు పూర్తిచేశారు ఆమె కుటుంబీకులు. పంచనామా తర్వాత మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించగా, ఆ వెంటనే అంత్యక్రియల్ని పూర్తిచేశారు.